టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఎవరి డైలాగ్ డెలివరీ వారిది. అయితే, ఒక మామూలు డైలాగ్‌కు తనదైన మేనరిజం జోడించి దానికి పాపులారిటీ తీసుకొచ్చే నటుడు మాత్రం మోహన్‌బాబు. భగవంతుడు నాకు స్టీరియో ఫోనిక్ సౌండ్ ఉన్న వాయిస్ ఇచ్చాడు.. అది సిలోన్ బ్యాండ్ లెవెల్లో మోగుతుంది అంటూ బ్రహ్మలో ఆయన చెప్పిన డైలాగ్ అక్షర సత్యం. ఏ డైలాగ్‌ను ఎక్కడ విరవాలో.. ఎక్కడ సాగదీయాలో ఆయనకు తెలిసినంతంగా మరో నటుడికి తెలీదంటే అతిశయోక్తి కాదు.
ఇటీవల ఇండియా టుడే టెలివిజన్‌లో రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన డైలాగ్‌లు చెప్పే విధానం గురించి తనదైన స్టైల్‌లో చెప్పారు. మోహన్‌బాబు నటించిన ఎం.ధర్మరాజు ఎంఏ చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ ఫసక్ అనే మాటను వాడారు. ఇప్పుడు ఆ మాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై మోహన్‌బాబు కూడా స్పందించారు. ‘ఫసక్ ట్రెండ్ కావడం సంతోషం. నేను వాడిన మాటను ఉపయోగించి దాదాపు 200 స్పూఫ్ వీడియోలు వచ్చాయని విష్ణు చెప్పాడు. కొన్ని చూశాను కూడా. చాలా ఫన్నీగా ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు మంచు ఫ్యామిలీ స్టార్స్ విష్ణు, మనోజ్, లక్ష్మీలు కూడా ఫసక్ (#fasak) హ్యాష్ ట్యాగ్‌తో ఆసక్తికర ట్వీట్‌లు చేశారు.