ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కథానాయికగా నటించిన ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా పాటలు ఉన్నాయంటూ తెలంగాణకు చెందిన కొందరు ముస్లింలు కేసు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు విచారణలో ఉన్న ఈ కేసు నేటితో ఓ కొలిక్కి వచ్చింది. ప్రియపై వేసిన కేసును కొట్టివేస్తూ ఈ రోజు (శుక్రవారం) సర్వోన్నత న్యాయస్థానం తీర్పువెలువరించింది.
‘ఒరు అదార్ లవ్ చిత్రంలోని మాణిక్య మలరయ పాటలో ప్రియ కన్ను కొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాట కేరళకు చెందిన ముస్లిం సంప్రదాయపు గీతం అని, ఇందులో ప్రియ కన్నుకొట్టడం అసభ్యకరంగా ఉందంటూ పలువురు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మాట్లాడుతూ..ఎవరో సినిమాలో ఏదో పాట పాడితే మీకు కేసు వేయడం తప్ప మరో పనేం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒమర్ లులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అబ్దుల్ రహూఫ్ కథానాయకుడిగా నటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది