టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవల వరుసగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తోన్న ఆయన గోల్ మాల్ గుజరాత్ మోడల్ కావాలా..? లేదంటే బంగారు తెలంగాణ మోడల్ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. తెలంగాణలో తమకు బీజేపీ, కాంగ్రెస్ పోటీనే కాదంటున్న కేటీఆర్.. మజ్లిస్, కేఏ పాల్ పార్టీలే తమకు ప్రత్యర్థులంటూ జాతీయ పార్టీలను లైట్ తీసుకుంటున్నట్లుగా మాట్లాడారు.
తాజాగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ ఇమేజీని ప్రజలకి తెలియ చేయడం కోసం సినీ రంగాన్ని వాడుకుంటోందన్నారు. ‘ఉరి: సర్జికల్ స్ట్రైక్’, ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రాలను ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించిన ఆయన.. ప్రభాస్ ఆదిపురుష్ గురించి ప్రస్తావించారు . హిందుత్వ అజెండా, పార్టీ ఐడియాలజీని ప్రచారం చేయడం కోసం ఆదిపురుష్ సహా 15-16 సినిమాలను బీజేపీ రూపొందిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఇమేజీ పెంచేలా ఈ సినిమాలు రిలీజవుతాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవాలనుకుంటున్న ప్రధాన రాష్ట్రాలకు చెందిన నటులు ఈ సినిమాల్లో ఉంటారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.