అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ జయంతి సందర్భంగా తన తల్లిని గుర్తుచేసుకుంటూ బిగ్‌బీ తన బ్లాగ్‌లో రాశారు. ‘ప్రపంచంలోనే అందమైన మహిళ అయిన మా అమ్మ జయంతి ఈరోజు. మనం ఓడిపోయినప్పుడు అమ్మ ఓదారుస్తుంది. మనం గెలిస్తే ఆమెకు ఆనందభాష్పాలు వస్తాయి. ఆమె బతికున్నన్నాళ్లు నేను వేళకి తింటున్నానా? లేదా? అని అడిగి తెలుసుకుంటూ ఉండేది. నేను బయటికి వెళితే రాత్రి త్వరగా వచ్చేయాలని చెప్పేది. నేను తాతనయ్యాక కూడా నాకు జాగ్రత్తలు చెప్పేది. అదే అమ్మంటే. నాకు సినిమాలంటే ఏంటో తెలియచేసింది, పరిచయం చేసింది అమ్మే. ఆమె ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉండేది. కానీ తన పిల్లలకి హాని జరుగుతోందని తెలిస్తే మాత్రం ఆడపులిలాగా మారిపోయేది.
‘ఉదయం లేవగానే నాకు వేడిగా కప్పు టీ ఇచ్చేది. ఉదయాన్నే ఆమె నాతో చెప్పే మాటలు ఎంతో హాయినిచ్చేవి. ఒకప్పుడు లాహోర్‌లోని ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆమె కాలేజ్ వరండాలో నడుస్తుంటే ఆమె వెనకే విద్యార్థులు ఫాలో అయ్యేవారు.ఆమె ఏ దుస్తులు వేసుకుంది? ఏ పెర్‌ఫ్యూం వాడుతుంది? ఇలాంటివన్నీ పరిశీలించేవారు. మా అమ్మకు డ్రైవింగ్ అంటే ఇష్టం.తను ఎప్పుడు కారెక్కి డ్రైవింగ్ చేసినా ఇంట్లోవారందరినీ దగ్గర్లోని షాప్స్, రెస్టారెంట్స్‌కు తీసుకువెళ్లేది. ఇప్పటికీ మా అమ్మ వెళ్లే కాఫీ షాపుల యజమానులు ఆమెను గుర్తుపెట్టుకున్నారు. ముంబయిలోనే కాదు దిల్లీలోని పలు కాఫీ షాప్ యజమానులు కూడా మా అమ్మను గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేవారు. వారితో ఆమె పంచుకున్న మాటలను నాతో చెప్పేవారు.
మా నాన్నకు స్వేచ్ఛ, సమయం ఇవ్వడానికి ఆమె ఎన్నో త్యాగాలు చేశారు.’ ‘ఆమెకు ఎరుపు గులాబీలంటే చాలా ఇష్టం. ఆమె ఎక్కడుంటే అక్కడ ఎర్ర గులాబీ మొక్కలను నాటి ఓ గార్డెన్‌ను ఏర్పాటుచేసేవారు. ఏటా అలహాబాద్‌లో ఆల్ఫ్రెడ్ పార్క్‌లో నిర్వహించే ఫ్లవర్ షోలో మా అమ్మకే అవార్డులు వచ్చేవి. పాఠశాలలో ఏర్పాటుచేసిన అథ్లెట్ సమావేశంలో తొలిసారి నేను నా సోదరుడితో కలిసి స్టేజ్‌పై నిలబడి కప్పులు గెలిచినప్పుడు తన వద్ద ఉన్న కెమెరాతో మా ఫొటోలు తీసింది. అమితాబ్ బచ్చన్, సోదరుడు అజితాబ్ బచ్చన్ అమ్మ తేజి బచ్చన్ తో కలిసి తీసుకున్న ఫోటోను అమితాబ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. చిన్నతనంలో తల్లితో కలిసి తీయించుకున్న ఫొటోల్లో ఇది ఒకటి అని అమితాబ్ చెప్పడం విశేషం. తేజి బచ్చన్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. భారత మహిళా ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుల్లో తేజీ బచ్చన్ కూడా ఒకరు.