హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావులతో పాటు మరో 500 మంది జనసేనలో చేరారు. వీరందరికీ పవన్‌కల్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”రాజకీయాల్లో ఎన్ని కష్టాలొచ్చినా బలంగా నిలబడతా..పార్టీ కోసం చిత్తశుద్ధిగా పనిచేసేవారికి అండగా ఉంటా. ఇది నా పార్టీ అని ఎప్పుడూ అనుకోలేదు. మనందరి పార్టీ అనుకున్నా. నాలుగు గోడల మధ్య కూర్చొని సమస్యలు పరిష్కరిస్తామంటే కాదు..వాటికి ఉత్తర్వులు ఇచ్చేస్తే సరిపోదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ చాలా సమస్యలున్నాయి. వాటికి పరిష్కారాలు చూపడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మనది కొత్త పార్టీ..మనం అందులో తొలితరం. ప్రారంభంలో కొన్ని కష్టాలు ఉంటాయి. అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొందాం”అని పవన్ అన్నారు.
ముఖ్యమంత్రి అవుతామా…ప్రభుత్వం ఏర్పాటు చేస్తామా? అనేది తర్వాత.. ముందుగా ప్రజా సమస్యలపై పోరాడాలి అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమస్యలతో సతమతమవుతున్న ప్రజల దగ్గరకెళ్లి వారి బాధలు వినాలి…అప్పుడే వాటికి పరిష్కారం దొరుకుతుందని అన్నారు. అయితే ప్రజల సమస్యలను ఓపిగ్గా వినేవాళ్లు లేకుండా పోతున్నారని పవన్ అన్నారు. వాడవాడకీ జనసేన జెండా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని రాజకీయ వ్యవహారాల కమిటీకి పవన్ కల్యాణ్ సూచించారు. ఇటీవల పార్టీ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ ఉద్దేశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని..జనానికి చేరువలో ఉండాలని అన్నారు. జనసేన బలోపేతానికి ప్రణాళిక బద్ధంగా అడుగులు వేయాలన్నారు.