బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా విమాన ప్రయాణం చేయగలిగే ఆర్థిక స్థోమత లేని చిన్నారులను ట్రూజెట్ ఉచితంగా విమాన సౌకర్యం కల్పించింది. చిన్నారుల ఆశలు, కలలను పండించే విధంగా వారిని చెన్నై- సేలం మధ్య ఉచితంగా బుధవారం ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళింది. మొత్తం నలభైమంది చిన్నారులు ఈ ప్రయాణం ద్వార సరికొత్త అనుభూతితో ఉప్పోంగిపోయారు. చిన్న వయసులోనే తమకు విమానంలో ప్రయాణించే అవకాశం కలిగినందుకు వారిలో ఆనందం, సంతోషానికి అవధులు లేకుండాపోయింది. తమిళనాడులోని ఎస్‌ఆర్‌వివి పాఠశాలకు సంబంధించిన 40 మంది చిన్నారులను వెల్లప్ప సెంబనా గౌండర్ మెమోరియల్ ట్రస్ట్ సమీకరించి ట్రూజెట్ ద్వారా ఉచితంగా ప్రయాణించే ఏర్పాటు చేసింది.
ఉదయం 10.30 గం॥లకు వారిని ట్రూజెట్ కమర్షియల్ సర్వీసులో తీసుకువెళ్లే కార్యక్రమంలో చిన్నారులకు విమాన సిబ్బంది ముఖ్యంగా ఎయిర్‌హోస్టేస్ అన్యోన్యంగా, అప్యాయంగా స్వాగతం పలికారు. ట్రూజెట్ తన వాణిజ్య కార్యక్రమాల్లో భాగంగా 300 మంది చిన్నారులను దశలవారిగా ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంలో భాగంగా నెహ్రూ జయంతి రోజున ఈ కార్యక్రమం నిర్వహించారు. సేలంకు చెందిన వారందరూ చెన్నైలో విద్యా, విజ్ఞాన యాత్రకు వచ్చారు. అక్కడి నుంచి వారిని తిరుగు ప్రయాణంలో ట్రూజెట్ ఉచితంగా తీసుకెళ్ళింది.
ఇంతకు ముందు వాల్మీకి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి బళ్ళారికి ఇదేవిధంగా 40మంది పేద విద్యార్థులను తీసుకెళ్ళింది. ఇటీవల ప్రకృతి వైపరీత్యంతో విలవిల్లాడిన కేరళలో వరద బాధితులను ఆదుకునేందుకు ట్రూజెట్ ప్రత్యేకంగా విమాన సర్వీసులను నిర్వహించింది. చెన్నై నుంచి బాధితులకు వస్తు సామాగ్రి తీసుకెళ్ళడంతో పాటు తిరుగు ప్రయాణంలో తిరువనంతపురం వరదల్లో చిక్కుకున్న వారిని చెన్నైకు తీసుకెళ్ళింది. ఆ విధంగా మూడు రోజుల పాటు షెడ్యూల్ నిర్వహించిన సంగతి తెలిసింది.