నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘పైసా వసూల్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. ధిమాక్ తోడా.. చాలా తేడా’ అంటూ తేడా సింగ్ పాత్రతో అభిమానుల ముందుకు వచ్చాడు బాలయ్య. గతంలో బాలయ్య మాస్ చిత్రాల్లో నటించారు. కానీ వాటన్నింటికీ ఈ ‘పైసా వసూల్’ చాలా భిన్నం. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ 101వ సినిమా అనౌన్స్ చేయగానే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయి ఉంటుందో.. ఎవరికీ అర్ధం కాలేదు. వరుస ఫ్లాపులతో ఉన్న పూరి కథను బాలయ్య అంగీకరించడం అందరికీ షాక్. దీంతో పూరి ఏరేంజ్ లో సినిమా చేసి ఉంటాడో.. అనుకున్నారు.
ఈరోజు భారీ ఎత్తున ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. బాలయ్య సరికొత్త అవతారం తేడా సింగ్ పాత్రలో కనిపించాడు. ఆయన మేనరిజం తప్ప సినిమా అంతా కూడా తేడా సింగ్ పేరుకి తగ్గట్లు తేడా తేడాగానే ఉంది. పూరిజగన్నాథ్ కు ఎన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ అతడు సినిమాల్లో హీరోలను ప్రెజంట్ చేసే విధంగా మరే దర్శకుడు చేయలేడని నమ్మి అవకాశాలు ఇస్తున్నారు హీరోలు. కానీ పూరి మాత్రం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. పరమ రొటీన్ కాన్సెప్ట్ ను అంతకంటే రొటీన్ గా తెరపై ఆవిష్కరించి చివర్లో ఎప్పటిలానే నాలుగు దేశభక్తి మాటలు చెప్పి ఎండ్ చేసేస్తున్నాడు.
అంతేతప్ప కథ, కథనాలపై దృష్టి పెట్టడంలేదు. బహుశా హీరోల మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ఆడియన్స్ సినిమా కథ గురించి పట్టించుకోరు అనుకుంటున్నాడో… ఏమో..? పూరి డైరెక్ట్ చేసిన సినిమాలు చూస్తే గనుక ఇదే ఫార్మాట్ లో అన్ని సినిమాలు ఉన్నాయనిపిస్తుంది. దాని నుండి బయటకు రాకుండా అదే కోవలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు పూరి.
ఇప్పటికే ‘ఇజం’ చిత్రంతో పెద్ద డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న పూరి ఈసారి అంతకుమించి అన్నట్లుగా తీశాడు ‘పైసా వసూల్’. కొన్ని కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి అది నిజమే.. కానీ రొటీన్ కథ, కథనాలతో ఎంతకాలం నెట్టుకొస్తాడనేది ఆయన్ను ఆయనే ఓసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది.
పూరి సినిమాల్లో కనిపించే అవే గ్యాంగ్ సెటప్, విలన్స్, అమ్మాయిలను వెక్కిలిగా చూపించడం.. ‘పైసా వసూల్’ పరిస్థితి కూడా అంతే.. మరి ఈ సినిమా తరువాత కూడా పూరికి అవకాశాలు వస్తే గనుక అది పెద్ద వింత అనే చెప్పాలి. బహుశా.. ఒకప్పటిలా మంచి ప్రేమకథలను గనుక ఆయన సిద్ధం చేసుకొని రూపొందిస్తే తను కోల్పోయిన చరిష్మాను తిరిగిపొందే అవకాశాలు ఉన్నాయి. త్వరగా పూరి ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటే మంచిది లేదంటే ఇలాంటి తేడా సింగ్ లు వస్తూనే ఉంటారు.