‘పరి’ అంటూ ఎప్పుడూ చూడని గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క శర్మ. ఈ సినిమాకి సంబంధించి రోజుకో పోస్టర్, టీజర్ విడుదల చేస్తూ ప్రేక్షకులను భయపెట్టించింది చిత్రబృందం. దాంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ పాటు, మంచి టాక్, రివ్యూలు వచ్చాయి. ఆమె చాలా సంతోషంగా ఉన్న ఈ సమయంలో ఈ సినిమా తమ దేశంలో రిలీజ్ చేయటం లేదంటూ పాకిస్దాన్ ప్రకటించింది. తమ ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా ఈ సినిమా ఉందని, అనుష్క శర్మ చిత్రంలో చేతబడి, మంత్రశక్తులు వంటివాటిని ప్రమోట్ చేసేదిగా ఉందంటూ పాక్‌లో ఆమె సినిమాపై నిషేధం విధించారు.
‘పరి కథ, మాటలు, కథా వరుస మొత్తం కూడా ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ చిత్రం కాన్సెప్ట్ మాకు సరిపడదు. ఈ సినిమా చూసేవారంతా కూడా బ్లాక్ మ్యాజిక్‌కు దగ్గరయ్యే ప్రమాదం ఉంది. మా మతానికి విరుద్ధంగా సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రమోట్ చేసేలా పరి చిత్రం ఉంది. అందుకే ఈ సినిమాను మా దేశంలో విడుదల కానివ్వబోము’ అని పాక్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్ తెలియజేసింది.