అమరావతిలో ఐటీ కంపెనీలను ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికీ తనంటే గౌరవం ఉందని నారా లోకేష్ అన్నారు. అయితే, తనపై పవన్ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు తనను బాధపెడుతున్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ నాపై పదే, పదే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదు.. నేను అవినీతిపరుడ్నే అయితే ఇన్ని కంపెనీలు ఎలా వస్తాయి..? ఆధారాలుంటే ఆరోపణలను నిరూపించాలని
ఎన్నోసార్లు సవాల్ విసిరాను.. అయినా ఆయన ఎందుకు నిరూపించలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. తనకు అసలు పరిచయం లేని శేఖర్ రెడ్డితో సంబంధాలు అంటగట్టడం దారుణమన్నారు.
వ్యక్తిగత విమర్శలు చేస్తే పవన్ ఎలా బాధ పడతారో.. నేనూ అలాగే బాధపడుతున్నాను. బుల్లెట్ ట్రైన్ కోసం భూమిని సేకరించలేకపోతున్నారు.. కానీ రాజధానికి 33 వేల ఎకరాల భూమిని రైతులు ఉదారంగా ఇచ్చారు. కొంత మంది కోసం పెద్ద ఎత్తున భూములిచ్చిన రైతులను ఇబ్బంది పెట్టలేం. అర్ధం లేని ఆరోపణలు చేస్తే.. ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబడులకు వెనకాడతాయి. పవన్ కూడా కొన్ని కంపెనీలను రాష్ట్రానికి తెస్తే.. వారికీ ఇదే తరహా పాలసీని ఇస్తాం. సాక్ష్యాల్లేని ఆరోపణలు చేస్తే కంపెనీలు వెనక్కు వెళ్లిపోతాయి అన్నారు.
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు నిర్ణయం తీసుకున్నాం. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో ఇంకా రిజర్వేషన్ల వ్యవహరం ఓ కొలిక్కి రాలేదు. జగన్ కాపు రిజర్వేషన్ల గురించి ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పారో అందరికీ తెలుసు. అందుకే అనుభవం ఉన్న వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని లోకేష్ అన్నారు.