2009లో తొలిసారి పవన్ కళ్యాణ్ అడుగులు రాజకీయాల వైపు పడ్డాయి. సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరుపున ప్రచారం చేశారు. అయితే అప్పుడు పవన్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తరువాత 2014లో టీడీపీ, బీజేపీ తరుపున ప్రచారం చేశారు. అప్పుడు కూడా తనకు టికెట్ కావాలని అడగలేదు. కానీ ఈ ఎన్నికల్లో జనసేన తరుఫున పవన్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం అటు ఫ్యాన్స్‌లోనూ ఇటు రాజకీయ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ నేతలకు టికెట్ కేటాయించే పనిలో బిజీగా ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇటీవల కమ్యూనిస్టులతో తప్ప ఏ పార్టీతో కలిసి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనన్న ఉత్కంఠకు తెరదించినట్లయింది. ఆయన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన శ్రేణులను సన్నద్ధం చేసేందుకు పవన్‌కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నరన్న ప్రచారం సాగుతోంది.
పిఠాపురం అసెంబ్లీ సీటు కోసం జనసేనలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను స్క్రూటినీ టీంకు పంపించిన పవన్.. ఈ నియోజకవర్గంలో ఆయనే పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో దరఖాస్తు చేసుకున్నవారి ఆశలు అడియాశలుగా మారాయని అనుకుంటున్నారు. మిగతా నియోజకవర్గాల కంటే ఇక్కడ జనసేనకు అత్యంత అనుకూల పరిస్థితులున్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో పవన్‌కు విశేష ఫ్యాన్స్ బలం ఉంది. అందుకే పవన్ ఈ నియోజకవర్గంపై కన్నేసినట్లు సమాచారం. పిఠాపురంలో పవన్ విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయని రాజకీయంగా చర్చ సాగుతోంది.
పవన్ పిఠాపురంలో పోటీ చేయడంతో తూర్పుగోదావరి జిల్లాలోనూ జనసేనకు అనుకూల పవనాలు వీచే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా కాకినాడ ఎంపీ సీటు కలిసొస్తుందని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు.