జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నానని నటి రేణూ దేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. పిల్లల్ని రక్షణ చూసుకోవడానికి తనతోపాటు ఓ వ్యక్తి తోడు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి చేసుకోవాలన్న తన అభిప్రాయాని వెల్లడించారు. దానితో అప్పట్లో నెటిజన్లు సోషల్‌మీడియాలో ఆమెను విమర్శించారు. ఏదైతేనే రేణు వారందరికీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మహిళలు మళ్లీ పెళ్లి చేసుకోకూడదా? అని ప్రశ్నించారు. కాగా రేణుకు సరైన భాగస్వామి దొరికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీనికి ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోనే కారణం.
రేణు సోషల్‌మీడియా వేదికగా శనివారం ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను పంచుకున్నారు. దీంతో పాటు ‘నా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికా’ అంటూ కవిత రాశారు. ఈ ప్రయాణంలో ప్రేమ అనేది ఓ అనుభూతి అన్న సంగతిని మర్చిపోయానని అందులో పేర్కొన్నారు. ‘నీలో నా ప్రేమ దొరికింది’ అంటూ ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వర్ణించారు. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు’ అంటూ ఆమె కవితలో తన భావాల్ని రాశారు. దీంతో ఆ వ్యక్తి తనకు కాబోయే భర్తే అని అందరూ అనుకుంటున్నారు. ఈ కోణంలోనే కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రేణు స్పందించలేదు, ఆ వ్యక్తి ఎవరో స్పష్టత ఇవ్వలేదు.