మెగా ఫ్యామిలీ నుంచి “ఒక్కమనసు” సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కొణిదెల నిహారిక తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా “హ్యాపీ వెడ్డింగ్” అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా, నిహారిక హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.
మా మనవడికి పెళ్లి కుదిరిపోయింది.. పిల్ల సూపర్ అంటూ సీనియర్ నటి అన్నపూర్ణ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, ఇంద్రజ, పవిత్ర లోకేష్ నటించారు. ట్రైలర్ చూస్తుంటే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాక తర్వాత జరిగే సన్నివేశాలుగా అనిపిస్తున్నాయి. పెళ్లికి దగ్గర్లో హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులను వదిలి.. పరాయి ఇంటికి వెళ్లి ఉండాలంటే ఎలా ఉంటుందో ఆలోచించు అని హీరోయిన్ అంటుంటే ఏ.. మా అబ్బాయిలకు ఎటువంటి టెన్షన్స్ ఉండవనుకుంటున్నావా?.. ఎటువంటి అమ్మాయి మా ఇంటికొస్తుందో? మాతో సర్దుకుపోతుందో, లేదో?, మాలో ఇమిడిపోతుందా, లేదా? మంచిదా, చెడ్డదా?.. లేక నీలా పిచ్చిదా? అంటాడు హీరో. ఆఖరిగా హీరో పక్కన కూర్చుని నరేష్ దండం పెడుతూ వాళ్లు ఎవరనుకుంటున్నావురా అమ్మాయిలురా అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది. ఈ సినిమాను యువీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. శక్తికాంత్ సంగీతం అందిస్తున్నారు.