హీరో సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘తేజ్ ఐలవ్‌యూ’. ఈ చిత్రం పాటల విజయోత్సవం సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగింది. విశాఖతో తనకు చాలా అనుబంధం ఉందని, ఇక్కడి నుంచే తన నట ప్రస్థానం మొదలైందని..హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సందడి చేసింది. హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ విశాఖకు చెందిన సత్యానంద్ వద్ద తాను మూడు నెలలపాటు నటనలో మెలకువలు నేర్చుకున్నానన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో సినిమా చిత్రీకరణకు అనుమతులు ఏకగవాక్ష విధానంలో మంజూరయ్యేలా ప్రత్యేక లైజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో సినిమా తీస్తే హిట్టవుతుందనే సెంటిమెంట్ సినీ పరిశ్రమలో ఉందన్నారు. మరిన్ని సినిమాల వేడుకలు ఇక్కడ జరగాలని ఆకాంక్షించారు.
నటి అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ఎంతో ప్రేమతో ఈ సినిమాలో నటించానన్నారు. విశాఖ బీచ్ అన్నా, ఇక్కడి వంటకాలన్నా తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. దర్శకులు కరుణాకరన్ మాట్లాడుతూ మంచి కథాంశంతో సినిమా తీశానన్నారు. మరో 20 ఏళ్ల తరువాత కూడా ఈ చిత్రం గురించి మాట్లాడతారన్నారు. నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ దిగ్గజ దర్శకుడు బాలచందర్ నిర్మించిన మరోచరిత్ర సినిమా తనకు స్ఫూర్తి ఇచ్చిందన్నారు. అనంతరం హీరో సాయిధరమ్‌తేజ్‌కు ఖరీదైన గడియారాన్ని బహూకరించారు. అభిమానులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
పట్నాయక్‌కు సన్మానం…
తేజ్ పాటల విజయోత్సవంతోపాటు వీటీం డేరింగ్ అండ్ డాషింగ్ డాడ్ కార్యక్రమం నిర్వహించారు. వీరూమామ ఈవెంట్స్, సీఎంఆర్ ప్రాపర్టీస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఫాధర్స్ డే జరిగింది. ఈ సందర్భంగా తండ్రులు తమ పిల్లలతో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. విజేతలకు మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు. అయిదుగురు కుమారులు, ఒక కుమార్తెను ప్రయోజకులను చేసిన 82 ఏళ్ల పట్నాయక్‌ను నిర్మాత కేఎస్ రామారావు చేతుల మీదుగా సత్కరించారు. గాయకుడు సింహ బృందం తమ గానమాధుర్యంతో అలరించారు. తేజ్ చిత్రంలోని పాటల ప్రోమోలను ప్రదర్శించారు. సత్యానంద్, సీఎంఆర్ అధినేత వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.