కేరళ రాష్ట్రం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి, బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.ప్రజలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా మే 29 నుంచి ఇప్పటి వరకు 400 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ వరదల్లో తానూ చిక్కుకున్నానంటూ నటి అనన్య సోషల్మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. భావోద్వేగంతో మాట్లాడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం తను నటి ఆశా శరత్ (‘భాగమతి’ సినిమాలో పోలీసు ఆఫీసర్) ఇంట్లో ఉంటున్నట్లు చెప్పారు.
‘నా ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు మేం మా ఇంటిలో సురక్షితంగా ఉండగలిగాం. ఇప్పుడు పెరుంబవూర్లోని ఆశా శరత్ ఇంటిలో సురక్షితంగా ఉన్నాం. గత రెండు రోజులు జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని దురదృష్టకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం’ ‘నిమిషాల వ్యవధిలోనే నీటి మట్టం విపరీతంగా పెరిగిపోతోంది. నా బంధువుల ఇళ్లన్నీ కూడా నీట మునిగాయి. ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. నాకు తెలుసు ప్రజలు చాలా ఘోరమైన స్థితిలో ఉన్నారని. వారికి సహాయం చేయాలి. వారి కోసం ప్రార్థనలు చేద్దాం. మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని అనన్య ఫేస్బుక్లో అన్నారు. ఆమె అనేక మలయాళ చిత్రాలలో నటించారు. తెలుగులో ‘జర్నీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘అ..ఆ’ తో ఆకట్టుకున్నారు.