సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పడు రోబో సీక్వెల్‌గా కళ్లు చెదిరే బడ్జెట్‌తో, భారీ సాంకేతిక హంగులతో 2.0 సినిమాను తెరకెక్కించారు. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఈ సినిమా వచ్చే నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 29 వ తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక‌్షన్స్, దర్శకుడు శంకర్ ఈ మేరకు ట్విట్టర్‌లో తెలిపారు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన అమీజాక్సన్ నటించగా విలన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉంది. గతంలో పలు విడుదల తేదీలు ప్రచారమైనప్పటీకీ….వీ ఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగా సినిమా అనుకున్న తేదీకి విడుదల కాలేదు. భారీ గ్రాఫిక్ వర్క్, వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని ఈ సినిమాలో వాడటంతో చిత్రం పూర్తికావడానికి చాలా ఎక్కువ సమయమే పట్టింది. ఇప్పుడు ఈ పనులన్నీ పూర్తయ్యాయని, కాబట్టి నవంబర్ 29న విడుదల చేయబోతున్నామని శంకర్ ట్విట్టర్‌లో తెలిపారు.