ఫాదర్స్ డే సందర్భంగా చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకట్రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాన్నంటే ఆకాశమంత అభిమానం ఉంటుంది. బోలెడంత భయమూ ఉంటుంది. నిజ జీవితంలోనూ, నటనలోనూ నాకూ స్ఫూర్తి నాన్నే’ అన్నారు.
ఇంకా “నాన్న గుర్తుకు రాగానే కనిపించేది 6 అడుగుల అందమైన రూపం. ఆయన స్ఫురద్రూపి, ఆయన కన్ను, ముక్కు తీరు, వర్చసు, తలకట్టు చూస్తుంటే ‘ఇటాలియన్’లా ఉంటారు. అంత మంచి పర్సనాలిటీ ఆయనది. ఆ ముఖ వర్చస్సు మా అన్నదమ్ములకెవ్వరికీ పూర్తిగా రాలేదు. నా పెద్ద కూతురు సుస్మితకు అన్నీ ఆయన పోలికలే. మా నాన్నది డామినేటింగ్ పర్సనాలిటీ, మాట, తీరు, నడవడిక అన్నీ ప్రత్యేకమైనవే.
మా అందరితోటి ప్రేమ, వాత్సల్యంతో ఉన్నా, కొంచెం కఠినంగా ఉండేది నాతోనే. అల్లరి ఆటలు ఆడుతూ ఆయన్ని టెన్షన్ పెట్టేవాడినట. ఆ టెన్షన్‌కి నాన్నకి కోపం వచ్చి కఠనంగా ఉండేవారు. చదువు విషయంలో కాదు కానీ, ప్రవర్తన విషయంలో, క్రమశిక్షణ విషయాల్లో చాలా కఠినంగా ఉండేవారు. పెద్ద కొడుకుని, అందులో మగబిడ్డని అయ్యేసరికి ఎక్కడ పాడైపోతానోనని కొంచెం అలా ఉండేవారు నాతో. ఎంత కఠినంగా ఉన్నా, ప్రేమ విషయానికొస్తే ఆయన తినేటప్పుడు అన్నం కలిపి ముద్దలు తినిపించేవారు. నేను సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత కూడా ముద్దలు పెట్టి, ఆయన ముద్దు తీర్చుకునేవారు. ఫైట్స్ చేసి అలసిపోయి ఇంటికొచ్చి ఆదమరిచి నిద్రపోతుంటే..నా కాళ్లు నొక్కుతూ ఉండేవారు. మెలకువ వచ్చి ‘అదేంటి నాన్నా… మీరు నొక్కుతున్నారు’ అని అంటే ‘పడుకో’ అంటూ ప్రేమతో గదమాయించేవారు. ఆయన ప్రేమ అలా చూపించేవారు ” అని చెప్పుకొచ్చారు.