ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చికిత్స క్రమంలో ఆమె జుట్టు పూర్తిగా ఊడిపోయింది. గుండుతో ఉన్న ఫొటోల్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అయితే ప్రియాంకా చోప్రా సలహాతో కేశాలంకరణ నిపుణులను కలిసి విగ్గు తీసుకున్నట్లు సోనాలి తాజాగా తెలిపారు.
‘అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు? మనం కనిపించే విధానంపై మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. మనకు ఆనందాన్ని కల్గించే పనులు చేయడం చాలా ముఖ్యం.. అది సింపుల్‌గా పెట్టుకునే విగ్గు కావొచ్చు, ఎర్రగా వేసుకునే లిప్‌స్టిక్ కావొచ్చు, హై హీల్స్ ధరించడం కావొచ్చు.. నీకు ఇది మంచి? ఇది చెడు? అని పక్కవారు చెప్పరు. నాకు సరిపడే విగ్గు కోసం చూస్తున్నప్పుడు నాకో అనుమానం వచ్చింది. ‘నేను అందంగా కనిపించాలని ఆరాటపడుతున్నానా?’ అనుకున్నా. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాబట్టి చూడటానికి బాగుండాలని అనుకుంటుంటారు. బహుశా.. ఆ కారణమే నాతో ఇలా చేయించిందేమో?’.
‘నేను అందంగా ఉంటేనే సౌకర్యంగా ఫీల్ అవుతానని అర్థమైంది. తలకు స్కార్ఫ్ కట్టుకునే ఉద్దేశం ఉంటే అలానే చేసేదాన్ని. గుండుతో తిరగాలి అనుకుంటే తిరిగేదాన్ని. ఏం చేస్తే సంతోషంగా ఉంటారో కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది కదా. కాబట్టి నచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకునేందుకు ప్రయత్నించాలి. నాకు ‘బోకీ హెయిర్’ (విగ్గుల తయారీ సెలూన్) గురించి చెప్పినందుకు ధన్యవాదాలు ప్రియాంకా చోప్రా. వాళ్లు నా కొత్త లుక్‌ను సృష్టించారు’ అని సోనాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఓ వీడియోను, ఫొటోను కూడా షేర్ చేశారు.