సిని ఇండస్ట్రీలో మెరిసే తారలు ఏదైనా కొత్త స్టైల్లోకి మారితే హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి వార్తల్లో నిలిచింది నటి త్రిష. కారణం జుట్టుని కురచగా కత్తిరించుకోవడమే. ఉన్నట్లుండి త్రిషకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అనే చర్చ జరుగుతోంది. పైగా చేతిలో సినిమాలు లేకపోతే ఏదో సరదా కోసం చేశారనుకోవచ్చు. ఇటీవల కమిట్ అయిన రజనీకాంత్ సినిమాతో కలిపి ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి.
రజనీ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ గత కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ త్రిష ఎంటర్ అవ్వలేదు. త్వరలో ఎంటర్ కానున్నారు. ఈ సమయంలో హెయిర్ కట్ చేయించుకున్నారంటే రజనీ సినిమా కోసమే అని, ఇందులో త్రిష కొత్త లుక్లో కనిపిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహలు నిజం అవ్వొచ్చు.. అవ్వక పోవచ్చు. కొన్ని రోజులు ఆగితే ఈ లుక్ కథేంటో తెలుస్తుంది. అన్నట్లు ఇప్పటివరకూ త్రిషను ఏ సినిమాలోనూ ఇలా చూడలేదు. సో.. సరికొత్త త్రిషను చూడబోతున్నామన్న విశేషం మాత్రం అర్ధమౌతుంది.