తెలంగాణలో అధికారపక్షంలోనే కాదు, విపక్షంలోనూ హడావుడి పెరిగింది. వరాలతో అన్ని రకాల వర్గాలను ఆకట్టుకునే పనిలో అధికార టీఆర్ఎస్ ఉంది. మరోవైపు తమకు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమేం చేస్తామో కాంగ్రెస్ ఏకరువుపెడుతోంది. అటు బీజేపీ కూడా తాను రేసులో ఉన్నట్టు తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. రేపు అసెంబ్లీ రద్దు ఖరారు అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం నుంచి సమావేశాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఫాంహౌస్ నుంచి ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎం మొదట ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో ముచ్చటించారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి సీఎస్ జోషి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులతో సమావేశమై చర్చలు జరిపారు. అసెంబ్లీ రద్దు తర్వాత డిసెంబర్‌లోనే ముందస్తు ఎన్నికలు జరిగేందుకు వీలుగా తీసుకోవాల్సిన పకడ్బందీ చర్యలపై ఆయన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. రేపటి కేబినెట్ ఎజెండా, అసెంబ్లీ రద్దు తర్వాత పరిణామాలపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు వర్గాల ప్రజలకు వరాలు ప్రకటించడంతోపాటు.. అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ సిఫారసు చేస్తారని భావిస్తున్నారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ
పెంచుతూ జీవో జారీచేసింది.