ప్రస్తుతం సోషల్ మీడియాకు బాగా ప్రాధాన్యం పెరిగిపోయింది. దీని కారణంగా సినిమా సెలబ్రెటీలకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ట్రోలింగ్‌తో హీరోహీరోయిన్లు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కన్నడ నటుడు యష్‌పై హీరో సుదీప్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. దానికి కారణం సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్న ఫిట్‌నెస్ ఛాలెంజ్.
సినిమా సెలబ్రెటీలు తమ వర్కవుట్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ నుంచి సవాల్ స్వీకరించిన కన్నడ హీరో యష్..సోషల్ మీడియాలో తన వీడియో పోస్ట్ చేసి సుదీప్‌తో పాటు మరికొందరిని నామినేట్ చేశాడు. అయితే ఆ సందర్భంలో సుదీప్‌ను ఏకవచనంతో సంబోధించాడు. తమ అభిమాన హీరోను యష్ కేవలం సుదీప్ అంటూ సంబోధించడం అభిమానులకు నచ్చలేదు. దీంతో సుదీప్ అభిమానులు రెచ్చిపోయి ట్రోలింగ్ మొదలెట్టారు. ఈ ట్రోలింగ్‌పై సుదీప్ స్పందించాడు. ‘యష్ పోస్ట్ చేసిన వీడియోలో నాకు అభ్యంతరకరంగా ఏమీ కనిపించలేదు. నా మీద ప్రేమ, మర్యాద మాత్రమే కనిపించాయి. యష్ విషయంలో అభిమానులంతా సంయమనం పాటించాలి. యష్‌ను ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర ట్వీట్ చేయొద్దు’ అంటూ రిక్వెస్ట్ చేశాడు.