పశ్చిమగోదావరి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గాల్లో తణుకు ఒకటి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 7 ఎన్నికల్లో టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ రెండుసార్లు గెలిచాయి. 2 లక్షలకు పైగా ఓటర్లున్న తణుకులో నాలుగోవంతు కాపులు. బీసీలు, ఎస్సీలు కీలకమైన తణుకులో 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణ గెలిచారు. వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, విద్యావేత్తగా, అందరినీ కలుపుకుని వెళ్లే నాయకుడిగా రాధాకృష్ణకు పేరుంది. ఎన్నికల హామీల్లో గృహ నిర్మాణాలు, రహదారులు ఇతర సంక్షేమ పథకాల్లో ముందున్నారనే పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. తణుకులో టీడీపీ కేడర్‌కు గట్టి పట్టు ఉండటం, వివాదాల జోలికి పోకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టడం రాధాకృష్ణకు కలిసొచ్చే అంశమంటున్నారు టీడీపీ నేతలు.
తణుకు వైసీపీ అభ్యర్థిగా కారుమూడి నాగేశ్వరరావు పోటీ చేయబోతున్నారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కారుమూడికి బలమైన బీసీ నాయకుడిగా పేరుంది. 2014లో దెందులూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గం తణుకు నుంచి బరిలో దిగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో జోరు కనపడుతోంది. 2009లో కారుమూడి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినా తణుకులో అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు. ఈసారి కాపుసామాజిక వర్గం కీలకం కాబోతున్నదని చెబుతున్నారు. మరోవైపు కాపు రిజర్వేషన్లపై వైసీపీ ఊగిసలాడుతోందన్న అభిప్రాయంతో తణుకు నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ఓటర్లు ఆ పార్టీకి ఎంత వరకు మద్దతిస్తారో చెప్పలేం. మరోవైపు తణుకులో వైసీపీ, టీడీపీలకు జనసేన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. కాపుల ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి బూత్ స్థాయిలో ఉన్న నాయకత్వం ముందు పవన్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలంటున్నారు. ప్రస్తుతానికి తణుకు నియోజకవర్గంలో టీడీపీ బలంగా కనిపిస్తుందంటున్నారు.