డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఈరోజు సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు.
ముత్తువేల్ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. అక్కడ కొన్ని క్రతువులు పూర్తి చేసిన తర్వాత ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించే అవకాశముంది. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.