బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతోంది. బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తామని హామీ ఇచ్చిందని.. ఇప్పటి వరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని, ఇంటిస్థలం ఇస్తామన్నారు.. అదీ ఇవ్వలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సీఎంవోకు జ్వాల ట్వీట్ చేశారు. అథ్లెట్స్‌కి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద.. ప్లాట్‌ని ప్రకటించిందని.. అందులో భాగంగానే తనకు హామీ ఇచ్చారని, తాను అడగలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తనకు మాత్రం ఆ ప్రోత్సాహకం అందలేదని గుత్తాజ్వాల ఆవేదన వ్యక్తం చేస్తోంది.
గత ఏడాది క్రీడల మంత్రి పద్మారావుని కలిసిన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై గుత్తాజ్వాల చర్చించింది. కొంతకాలంగా బ్యాడ్మింటన్‌లో రాజకీయాలపై బహిరంగంగానే పెదవి విరుస్తున్న గుత్తాజ్వాల.. ఇప్పుడు పూర్తిగా ఆటకి దూరమై అకాడమీని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికైనా అకాడమీకి స్థలం కేటాయించాలని.. తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా సరైన స్పందన లేకపోవడంతో.. తాజాగా ట్విట్టర్లో తన ఆవేదనను వెల్లడించింది.