ఎన్నికల ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 11న పోలింగ్. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో సీట్ల కోసం జంపింగ్ లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ బేజారెత్తుతోంది. సరైన అభ్యర్థులు కూడా టీడీపీకి దొరకని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలు చూస్తుంటే బాబు గారి పట్టు తెలుగుదేశం పార్టీపై జారిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి..
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సీట్ల ముసలం వచ్చింది. కోరిన సీటు దక్కలేదని కొందరు.. ఓడిపోయే సీటు ఇచ్చావంటూ కొందరు పార్టీలు మారుతున్నారు. ఇక సీట్లు మార్చిన వారి బాధ వర్ణనాతీతం. మంత్రి గంటా లాంటి వారైతే ఇప్పటికీ సీటు కన్ఫం కాక కుమిలిపోతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.
ఇలా అసంతృప్తి, అసమ్మతి గోలతో బాబు సీట్లు తెగ్గొట్టలేక లబోదిబోమంటున్నాడని టాక్. మొత్తం అభ్యర్థులను ప్రకటించలేక ఆపసోపాలు పడుతున్నాడట.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్లు ప్రకటిస్తే ఎంత రచ్చ జరుగుతుందో.. ఎంత గొడవ అవుతుందోనని టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటున్నట్టు టాక్.
టీడీపీ జాబితా ప్రకటించగానే చాలా మంది పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. టికెట్లు దక్కని వారంతా వైసీపీ చేరడం ఖాయమంటున్నారు. తెలుగుదేశంలో అసంతృప్తి జ్వాలలతోనే చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాలు పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.