టాలీవుడ్ సినీ దర్శకురాలు బి. జయ (54) గురువారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు. ఆమె మొదటిగా పాత్రికేయురాలిగా తన ప్రస్థానాన్ని ఆరంభించారు. ఆ తర్వాత ప్రముఖ సినీ వార పత్రికలో పనిచేశారు. ప్రస్తుతం సూపర్ హిట్ అనే సినీ వారపత్రికను నిర్వహిస్తున్నారు జయ . దర్శకత్వం పట్ల ఆసక్తితో సినీ రంగంవైపు అడుగేశారు. 2003లో తొలిసారి చంటిగాడు సినిమాను దర్శకత్వం చేసి తనను తాను నిరూపించుకున్నారు. ఆ సినిమా మంచి హిట్ అయింది.
ఆ తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ..తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన వైశాఖం ఆమె దర్శకత్వంలో విడుదలైన చివరి చిత్రం. ఈ చిత్రానికి సిల్వర్ క్రౌన్ అవార్డ్‌ను అందుకున్నారు జయ. ఆమె భర్త బి.ఎ. రాజుతో కలిసి పలు చిత్రాలనూ నిర్మించారు. ఆమె స్వయంగా తన చిత్రాలను తానే ఎడిటింగ్ చేసుకుంటారు. తెలుగు సినీ రంగంలో తొలి మహిళా ఎడిటర్‌గానూ ఖ్యాతి గడించారు. శుక్రవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.