తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జనసేనలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌ను కలిసి మోత్కుపల్లి ఆ పార్టీలోకి చేరనున్నట్టు సమాచారం. తెలంగాణలో సీనియర్ నేత అయిన మోత్కుపల్లిని జనసేన తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో దశాబ్దాల కాలం పని చేశారు మోత్కుపల్లి. కేంద్రంలో ఎన్డీయే సర్కారు రాగానే మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కుతుందని ఆశించారు. అయితే అది జరగలేదు. అనంతర పరిణామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడుతూ వరుస ప్రెస్ మీట్లు పెట్టారు మోత్కుపల్లి. చంద్రబాబు తనకు తీవ్రమైన ద్రోహం చేశారని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు ఓటమి కోసం కృషి చేస్తానని, చంద్రబాబుని ఓడించాలని ఏపీలో ప్రచారం చేస్తానని కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయొద్దని.. వైఎస్ జగన్ లేదా, పవన్ కల్యాణ్‌కు ఓటు వేయాలని మోత్కుపల్లి.. ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీ మోత్కుపల్లిపై బహిష్కరణ వేటు వేసింది. ఆ తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరతారని అనుకున్నారు. అయితే మోత్కుపల్లి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి కేడర్ సైతం కంగుతిందట.
మొత్తానికి చూస్తే.. టీడీపీకి శత్రువుగా మారిన జనసేన గూటికి మోత్కుపల్లి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి బద్ధశత్రువుగా మారారు.! ఇంత వరకూ కలిసికట్టుగా ఉన్న పవన్-చంద్రబాబు ఇద్దరూ ఇప్పుడు విడిపోయారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే రీతిలో పరిస్థితులున్నాయి. దీంతో చంద్రబాబుకు పవన్ శత్రువు గనుక శత్రువు-శత్రువు తనకు మిత్రుడు అన్న చందంగా మోత్కుపల్లి జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మాత్రమే బలంగా ఉన్నాయి అయితే వాటిని కాదనుకుని మోత్కుపల్లి ఏం ఆశించి జనసేనలోకి చేరుతున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ పార్టీలో ఉన్న మోత్కుపల్లి జనసేనలో ఎంత వరకు సక్సెస్ కాగలరో వేచి చూడాల్సిందే.