ఏపీలో ప్రభుత్వం మారింది.. పద్ధతులు మారిపోతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లాంటి బంగారు బాతుగుడ్డు లాంటి సంస్థలో టీడీపీ నామినేటెడ్ పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఎలాగూ జగన్ ప్రభుత్వం తీసివేస్తుందని తెలిసి తామే తప్పుకుంటున్నారు.
తాజాగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు టీటీడీ భక్తి చానెల్ చైర్మన్ గా ఉన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడడంతో తన చైర్మన్ పదవికి ఈరోజు రాజీనామా చేశారు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేశానని.. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
2015లో రాఘవేంద్రరావును ఏపీ సీఎం చంద్రబాబు.. భక్తి చానెల్ చైర్మన్ గా నియమించారు. టీటీడీ దేవస్థానం బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. సినిమాలు పూర్తిగా తగ్గించిన ఆయన ఇలా సేవలందిస్తూ సినిమా పెద్దగా కొనసాగుతున్నారు.
ఇలా జగన్ ప్రభుత్వం ఏర్పడకముందే ఒక వికెట్ పడిపోయింది. మున్ముందు ఇంకా ఎన్ని వికెట్లు పడుతాయోనన్న టెన్షన్ నెలకొంది. చాలామంది నామినేటెడ్ పదవుల్లో ఇంకా కొనసాగుతున్నారు. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే ప్రక్షాళన చేయనున్నారు. ఆ పదవులన్నింటిని వైసీపీ నేతలకు ఇవ్వనున్నారు.