కాపు రిజర్వేషన్ల అంశంపై తాను హామీ ఇవ్వలేనని నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట బహిరంగ సభలో వైఎస్ జగన్ అన్నారు. “నేనేదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతా చేయగలిగిందే చెబుతా.. చెయ్యలేనిది చేస్తానని చెప్పే అలవాటు నాకు లేదు” అని జగన్ అన్నారు. అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులిస్తానన్నారు.
జగన్ వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలోకి రావంటూ జగన్ యూటర్న్ తీసుకోవడం బాధాకరమని అన్నారు. తుని ఘటన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరీ కాపు రిజర్వేషన్లకు జగన్ మద్దతు తెలిపారని, అలాగే అసెంబ్లీలోనూ మద్దతిచ్చారని గుర్తు చేశారు. కాపు ఉద్యమం పుట్టిన గడ్డమీదే కాపులను అవమానించడం దుర్మార్గమని అన్నారు. పదవీకాంక్షతో హామీలిచ్చే జగన్.. తమ జాతికి మాత్రం రిజర్వేషన్ ఇవ్వలేరా అని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లు మీ పరిధి కాదన్న మీ పల్లకీ మోయం.. మా జాతికి రిజర్వేషన్ ఇచ్చేవాళ్ల పల్లకీనే మోస్తాం’ అని ముద్రగడ స్పష్టం చేశారు.
తమ జాతిపై జగన్‌కు ఎందుకు చిన్నచూపో.. తమ జాతి ఏం తప్పు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. పదవీకాంక్షతో హామీలిచ్చే జగన్.. తమ జాతికి మాత్రం రిజర్వేషన్ ఇవ్వలేరా అని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదా.. లేక రిజర్వేషన్లంటేనే ఇష్టం లేదో జగన్ స్పష్టం చేయాలని కోరారు. గత 6 నెలలుగా పాదయాత్రలో ఇస్తున్న హామీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు సరిపోతాయా అని ఎద్దేవా చేశారు.
‘మా జాతి ఓట్లు అడిగే అర్హత మీకు లేదు. మా కాపు జాతికి మీరు టికెట్లు కూడా ఇవ్వొద్దు. ఒక్కో నియోజక వర్గంలో మా జాతి సోదరులను ముగ్గురిని ఎగదోస్తూ…వాళ్లతో లక్షలు ఖర్చు చేయిస్తున్నారు. మీ పాదయాత్రకు ప్రజలను తరలించడానికీ, ఫ్లెక్సీలు కట్టడానికి మా జాతి సోదరులు ఆస్తులు సమర్పించుకుంటున్నారని ముద్రగడ అన్నారు. జగన్ వల్ల కాపు రాజకీయ నేతల జీవితాలు, కుటుంబాలు నాశనమైపోతున్నాయని ఆరోపించారు.
తాము అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులిస్తామంటూ మా జాతిపై జగన్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ‘జగన్‌ను రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించాలని తన అనుచరులతో కబురు పంపారని, మా జాతికి ఏం చేశాడని జగన్‌కు స్వాగతం పలకాలని తాను అడిగానని ముద్రగడ అన్నారు. అందుకే ఆ ఉక్రోషంతోనే జగన్ మా జాతిని అవమానించాడని ముద్రగడ ఆరోపించారు. నిన్న మా కుటుంబంపై జగన్ మొసలి కన్నీరు కార్చాడని, జగన్ దొంగ ప్రేమ తమకు అక్కర్లేదని తమ జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యమని ముద్రగడ స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి పదవీ కాంక్ష వదిలేస్తే తమ జాతి రిజర్వేషన్ల ఆకాంక్ష వదులుకుంటామని ఛాలెంజ్ చేశారు. అలాగే కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పరిధిలోనిది తక్షణం అమలు చేయాలని.. కేంద్ర పరిధిలోనిది తర్వాత చేయొచ్చని విన్నవించారు. వంకలు పెట్టకుండా
తమ జాతి ఆకలి తీర్చాలని కోరారు.