సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. జాతీయ చానెళ్లు సైతం ఏపీలో వైఎస్ జగన్ దే అధికారమని ప్రకటిస్తున్నాయి. ఇంకా వారం రోజులు గడువు ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీలో మంత్రివర్గ విస్తరణపై అందరూ ఆశలు పెంచుకున్నారు. పార్టీలోని సీనియర్ నేతలందరి లిస్ట్ ను తీసుకొని వీరికి మంత్రి పదవులు ఖాయమని ప్రచారం జరుగుతోంది.
మే 23న అధికారం టీడీపీ దా..? ప్రతిపక్ష వైసీపీదా అన్నది తేలుతుంది. టీడీపీ కంటే వైసీపీలోనే ధీమా కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే అప్పుడు మంత్రులు, శాఖలపై కూడా పార్టీలో నేతలు క్లారిటీకి వచ్చేస్తున్నారు. ఓ లిస్ట్ తయారు చేసి మంత్రులు, కేబినెట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఆ లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇప్పటికే సీనియర్ నేతలు పోటీచేసిన నియోజకవర్గాల్లో మా నేత మంత్రి అంటూ కిందిస్థాయి నేతలు ఫ్లెక్సీలు, స్టిక్కర్లు పెట్టేస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఫలితాలు వెలువడే వరకూ కాస్త సంయమనం పాటించాలంటూ హితవు పలుకుతున్నారు.
వైసీపీ అధినేత జగన్ ఈసారి తన అనుయాయులు, సీనియర్లకే పెద్దపీట వేస్తారనే ప్రచారం జరుగుతోంది. జగన్ డ్రీం టీం ఇదేనంటూ హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్, స్పీకర్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఖాయమంటున్నారు. ఇక మంత్రులుగా ధర్మానా ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, కొడాలి నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆనం రాంనారాయణరెడ్డి , శ్రీకాంత్ రెడ్డి , మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని, ఆళ్ల రామకృష్ణరెడ్డి, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్కే రోజాకు హోంమంత్రి పదవి కూడా దక్కబోతోందన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి వైసీపీ గెలుపు. ఆ తర్వాత మంత్రి పదవుల యోగం ఎవరికి దక్కుతుందనేది మే 23న తేలనుంది.