ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో సోమవారం జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలో వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం సహకార చక్కెర ఫ్యాక్టరీని నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో 45 వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లారని వైఎస్ జగన్ విమర్శించారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీపై సుమారు 25 వేలకు పైగా కార్మికులు ఆధారపడతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన విధానాల కారణంగానే ఈ ఫ్యాక్టరీ తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయ్యాక సహకారం రంగంలోని ఫ్యాక్టరీలు, డైరీలు మూతపడుతున్నాయని ఆరోపించారు.
వైఎస్ హయాంలో లాభాల బాటలో ఉన్న సహకార రంగాలను 2014లో బాబు సీఎం అయ్యాక పూర్తిగా నష్టాల్లోకి తీసుకెళ్లారని విమర్శించారు. రైవాడ రిజర్వాయర్ నీటిని విశాఖకు తరలిస్తున్నారు. దాంతో ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీటిని విశాఖకు తరలించి.. రైవాడ రిజర్వాయర్ నీటిని పూర్తిగా స్థానిక రైతులకే కేటాయించవచ్చని జగన్ అన్నారు. కానీ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. వారి బంధువులకు, బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి దోచుకుంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలును తగలబెట్టి.. వైసీపీపై అనేక నిందలు మోపారని, తమ పార్టీకి చెందిన అనేక మంది నేతలపై అక్రమ కేసులు పెట్టారని జగన్ తెలిపారు. ఆడవారిపై, ఎస్సీలపై కూడా కేసులు పెట్టారని, ఘటన జరిగి 32 నెలలు గడిచినా ఒక్క ఆరోపణ కూడా రుజువుచేయలేకపోయారన్నారు.