తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ(61) నల్గొండలో ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి నెల్లూరులోని ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు ఎడమవైపు నుంచి కుడివైపునకు పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని రాసుకుంటూ వెళ్లింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ హరికృష్ణ ప్రాణాలను కాపాడలేకపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ హుటాహుటిన కామినేని ఆస్పత్రికి బయలుదేరారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు.
నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. చిన్నతనంలోనే 1967లో ‘శ్రీ కృష్ణావతారం’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తల్లా పెళ్లామా, రామ్ రహీమ్, దాన వీర శూర కర్ణ తదితర చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత సినిమాల నుంచి కొంచెం విరామం తీసుకున్న హరికృష్ణ తిరిగి శ్రీరాములయ్య చిత్రం తో 1998లో మరోసారి వెండితెరపైకి వచ్చారు. ఆ తర్వాత సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, శివరామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణమాసం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాల తర్వాత ఆయన మళ్లీ ఏ చిత్రంలోనూ నటించలేదు.
నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చాక.. హరికృష్ణ తండ్రి వెంటే నడిచారు. ఎన్టీఆర్ ప్రచార వాహనం చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపించారు. తెలుగు దేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లాక.. అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మళ్లీ తెలుగుదేశంలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ప్రస్తుతం సినీ రంగంలోనే ఉన్నారు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా 2014 జనవరిలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. ఆ ప్రమాదం కూడా నల్గొండ జిల్లా పరిధిలోనే జరిగింది.