ప్రపంచ వ్యాప్తంగా ఇది జనమా ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణ గిరిజనగూడేలు, లంబాడా తండాలు, మారుమూల పల్లెలు, ప్రాంతాల నుంచి నలువైపుల నుంచి తరలివచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. సభను చూస్తుంటే గత జ్ఞాపకాలు కళ్ల ముందు కదులుతున్నాయని కేసీఆర్ అన్నారు. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం ఎడా పెడా విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారని అన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నాటి సీఎంకు నేను రాసిన బహిరంగలేఖతో ఉద్యమానికి బీజం పడిందని కేసీఆర్ అన్నారు. 9, 10 నెలల పాటు విపరీత మేథోమథనం జరిగిందని.. ఏం చేయగలం.. ఏమి చేయలేం, మన అసహాయ స్థితి ఇంతేనా.. గుడ్లలో నీళ్లు గుడ్లలోనే కుక్కుకోవాల్సిందేనా.. ఏదైనా మార్గముందా.. లేదా అని ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు, కొన్ని వేల మందిని సంప్రదించాను. సమైక్య రాష్ట్రంలో కష్టాలు తీరవని తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించానని కేసీఆర్ అన్నారు.
ఎన్నో త్యాగాలు, రాజీనామాలు, ఉప ఎన్నికలు, ఢిల్లీ యాత్రలు, పక్షి తిరిగినట్టు నేను మొత్తం తెలంగాణ తిరగడం, ప్రభంజనంలా జనం ఎక్కడికెళ్లినా జేజేలు పలకడం..యువత విద్యార్థులు, మహిళలు, అందరూ భాగస్వాములు కావడంతో ఒక ఉప్పెన సృష్టించామని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. మొదట్లో వాగ్దానం చేసిన ఢిల్లీ పెద్దలు అహంకారంతో ఉద్యమాన్ని కాలరాసే కుట్రలు చేశారని కేసీఆర్ తెలిపారు. గులాబీ జెండా పని అయిపోయిందని ప్రచారం చేశారు. ఎంతో శ్రమపడి ఒక్కో పార్టీని ఒప్పించి 36 పార్టీల మద్దతు కూడగట్టి, అనేక పోరాటాలు చేసి 14 ఏళ్ల కఠోర శ్రమ తర్వాత తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిందని సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజలంతా భాగస్వాములే అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు మనం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం 2006-07 సంవత్సరంలో జయశంకర్ సర్‌తో కలిసి ఆరోజు చేసిన మథనంలో వచ్చినదేనని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వస్తే ఏం చేయాలో ఆనాడే మేథోమథనం జరిగిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని కేసీఆర్ అన్నారు.