కేరళ రాష్ట్రానికి వచ్చిన కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రం పట్ల కేంద్రం స్పందించిన తీరు మొక్కుబడిగా ఉందని విమర్శించారు. కేవలం రూ.600 కోట్లు సాయంగా ఇచ్చి తమ బాధ్యత పూర్తయిందనుకోవడం సరికాదని చంద్రబాబు ఆక్షేపించారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు రెండు వేల టన్నుల బియ్యం కూడా పంపించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరదలతో విలవిల్లాడుతున్న కర్ణాటకనూ కేంద్రం ఆదుకోవాలి అని చంద్రబాబు అన్నారు. కేరళను సామాజిక బాధ్యతతో అంతా ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు చంద్రబాబు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పాలు, బియ్యం, పశుగ్రాసం పంపిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదల వల్ల తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. పంట నష్టం అంచనాలు రూపొందించాలని ఆదేశించామని, కేంద్రానికి పంపేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.