అప్పులతో విభజించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తున్నారని పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్, పవన్‌లు ప్రధాని మోదిని ప్రశ్నించే దమ్ములేదని, చేతనైతే కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చంద్రబాబు చెప్పారని.. వైసీపీ మాత్రం తన పత్రిక ద్వారా, నేతల ద్వారా బీజేపీకి మద్దతు తెలిపిందని ఆరోపించారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ముటుకూరులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతి పేదకుటుంబానికి మేలుచేసే లక్ష్యంతో చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి అనేక పథకాలకు రూపకల్పన చేశామని.. రాష్ట్రంలో నాలుగేళ్లలో 720 పరిశ్రమలు రావడంతో 2.20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని, ఇంకా 12లక్షల మంది నిరుద్యోగులున్నట్లు సర్వేలు నిర్ధారించాయని అన్నారు. వీరందరి కోసం త్వరలోనే “యువనేస్తం” పేరుతో నిరుద్యోగభృతి ఇస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తెలుగువారి సత్తా చూపాలన్నారు. ముటుకూరు గ్రామాభివృద్ధిపై
రూపొందించిన పుస్తకాలను ఆయన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావులతో కలిసి ఆవిష్కరించారు.