రాజకీయ రాజధాని బెజవాడ. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన నందమూరి తారక రామారావుతో పాటు ఎందరో ప్రముఖులకు జన్మనిచ్చిన గడ్డ. కృష్ణమ్మ పరవళ్ల సాక్షిగా దుర్గమ్మ సన్నిధిలో కొలువైన జిల్లాలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. కృష్ణా జిల్లాలో పట్టుకోసం టీడీపీ, వైసీపీ ఎత్తుకు పైఎత్తులేస్తుంటే కొత్తగా జనసేన బరిలోకి దిగుతోంది. వామపక్షాలతో పాటు అన్ని పార్టీలకూ పట్టం కడుతూ వచ్చిన కృష్ణా జిల్లాలో ఏ పార్టీ రాజకీయాలు ఎలా ఉన్నాయి, సమీకరణాలు ఎలా మారుతున్నాయి
ఏపీ రాజకీయాల్లో మొదట్నుంచీ కృష్ణా జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. పార్టీలతో పాటు సామాజికవర్గాల పరంగా కీలకమైన కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. జనసేన తన ప్రభావం చూపే ప్రయత్నాల్లో ఉంటే చేజారిన ఓటుబ్యాంకును తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీకి కృష్ణా జిల్లా ఎక్కువ స్థానాలు కట్టబెడుతోంది. అయితే బెజవాడ నగరంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్ పుంజుకోగా, 2014 ఎన్నికల వరకు టీడీపీ వెనుకబడే ఉంది. గత ఎన్నికల్లో విజయవాడలో చిక్కిన పట్టును పోగొట్టుకోకుండా మరింత బలపడే ప్రయత్నాల్లో టీడీపీ ఉంది. మరోవైపు టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీలతో పాటు సామాజిక వర్గాల సమీకరణలు కీలకమైన కృష్ణా జిల్లాలో టీడీపీ-వైసీపీ మధ్య ప్రధానంగా తలపడబోతున్నారు. జనసేన కూడా తన ప్రభావం చూపించే ప్రయత్నాల్లో ఉంది. చేజారిన ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ తహతహలాడుతోంది.
1983 వరకు కృష్ణా జిల్లాలో కాంగ్రెస్‌దే పైచేయి. ఆ తర్వాత టీడీపీ ఆధిక్యం చూపిస్తూ వస్తోంది. 1999లో జిల్లాలో టీడీపీ జెండా రెపరెపలాడింది. బీజేపీతో కలిసి బరిలోకి దిగిన టీడీపీ 15 అసెంబ్లీ సీట్లలో 12 గెలుచుకోగా, బీజేపీ ఒకటి దక్కించుకుంది. అప్పట్లో కాంగ్రెస్ 4 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత వైఎస్ పాదయాత్ర, ప్రభుత్వంపై వ్యతిరేకతతో 2004లో కృష్ణా జిల్లాలో టీడీపీ చతికిలబడింది. కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 3 సీట్లకే పరిమితమైంది. 2009 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ పుంజుకుని 8 సీట్లు గెలిస్తే.. కాంగ్రెస్ 6 స్థానాలు, ప్రజారాజ్యం 2 స్థానాలు దక్కించుకున్నాయి. 2014లో టీడీపీ మరోసారి తన బలాన్ని నిరూపించుకుని 11 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 5 స్థానాలు దక్కించుకుంది. జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలు కీలకమైనవే. మచిలీపట్నం ఎఁపీ సీటు 2004లో కాంగ్రెస్ దక్కించుకోగా 2009, 2014లో టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ గెలిచారు. ఇక విజయవాడలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి లగడపాటి ఎంపీ అయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని గెలిచారు.
2014 తర్వాత ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారడంతో వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయని ఆసక్తి పెరుగుతోంది. 2014 ఎన్నికల్లో కలిసి బరిలో నిలిచిన టీడీపీ, బీజేపీ, జనసేన ఇప్పుడు తలోదారి అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో 3 పార్టీలు అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి పడిన ఓట్లు చీల్చే ప్రయత్నం జరుగుతోంది. సొంతంగా సీట్లు గెలవకపోయినా టీడీపీని దెబ్బతీయగలమనే ఆలోచనలో ఉంది బీజేపీ. 2009లో రెండు స్థానాలు ప్రజారాజ్యం గెలుచుకున్న కృష్ణా జిల్లాపై జనసేన కూడా ఆశలు పెట్టుకుంది. బీజేపీ, జనసేన టీడీపీ ఓట్లు చీల్చడం అంతిమంగా తమకు లాభమని భావిస్తోంది వైసీపీ. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు విజయవాడ పశ్చిమ, పామర్రు నియోజకవర్గాల్లో గెలుపును వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
కృష్ణా జిల్లా నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. విభజన సమయంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన లగడపాటి ఈ నాలుగేళ్లలో పలుమార్లు చంద్రబాబును కలవడం ఆసక్తిని రేకెత్తించింది. ఎలాంటి రాజకీయ కారణాలు లేవని లగడపాటి చెప్పినా వచ్చే ఎన్నికల్లో ఆయన ఏదో పార్టీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మరణంతో ఆయన కుమారుడు అవినాష్ పోటీ చేస్తారని భావిస్తున్నారు. వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన కొంత ప్రభావం చూపొచ్చని అంచనాలున్నాయి. ఏ పార్టీ అంచనాలు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. మచిలీపట్నం పోర్టు పనులు నత్తనడకన సాగడం, భూములపై ఆంక్షలతో వ్యతిరేకత ఏర్పడటం వైసీపీ ఆశలు పెట్టుకుంది. డెల్టా చివరి ప్రాంతాలకు నీరు అందకపోవడం సాగు, తాగునీరు అందని పెడన, కైకలూరులో వ్యతిరేకతను ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నాల్లో వైసీపీ ఉంది. రాజధాని నిర్మాణంతో పాటు పట్టిసీమకు నీరివ్వడం తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తోంది. మొత్తం మీద కృష్ణా జిల్లాలో వైసీపీ బలం పుంజుకుంటున్నట్టే కనిపిస్తోంది.
విజయవాడ తూర్పు ఒకప్పుడు వంగవీటి రంగా కుటుంబానికి పట్టున్ననియోజకవర్గం. 1985లో వంగవీటి రంగా తొలిసారి ఇక్కడి నుంచే గెలిచారు. ఆయన మరణం తర్వాత వంగవీటి రత్నకుమారి రెండుసార్లు తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. రంగా కుమారుడు వంగవీటి రాధ 2004లో రాజకీయాల్లోకి వచ్చి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో నియోజకవర్గం మారి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో మళ్లీ రాధ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ప్రజలు ఆయనకు మద్దతు పలకలేదు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయిన గద్దె రామ్మోహన్ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. నాలుగేళ్లుగా ప్రజలకు చేరువగా ఉంటూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బలపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు. అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లే తత్వం గద్దె రామ్మోహన్‌ది. 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచిన యలమంచిలి రవి బరిలోకి దిగే అవకాశాలున్నాయి. మొదట్లో టీడీపీలో చేరిన యలమంచిలి తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ సీటు ఆశించే వారిలో బొప్పన, ఎంవీఆర్ చౌదరి తదితరులున్నా యలమంచిలి రవి వైపే పార్టీ మొగ్గుచూపుతోంది. జనసేన కూడా నేతలను సిద్ధం చేసే పనిలో ఉంది. కాంగ్రెస్ ఆ సమయానికి ఎవరు సిద్ధమైతే వారికి సీట్లు ఇవ్వాలని నిర్ణయంతో ఉంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొదటి నుంచి మైనారిటీ వర్గాలకే అవకాశం దక్కుతూ వస్తోంది. 1999లో కాంగ్రెస్ నుంచి జలీల్‌ఖాన్, 2004లో కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్ధి నాజర్ వలీ గెలిచారు. 2014లో మళ్లీ వైసీపీ నుంచి గెలిచిన జలీల్‌ఖాన్ తర్వాత టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనకు గాని లేదా తన కూతురుకు గాని టికెట్ కోసం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రయత్నిస్తున్నారు. అధిష్టానం మాత్రం కొత్త ముఖం కోసం వెతుకుతోందని ప్రచారంలో ఉంది. 2009లో విజయవాడ పశ్చిమ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ 2014లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వచ్చిన వెల్లంపల్లి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. వరసగా పార్టీలు మారడంతో ఆయనపై ప్రజల్లో సదభిప్రాయం లేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసింది కూడా తక్కువే. దుర్గగుడి ఫ్లైఓవర్ అంశంపై ఆందోళన చేపట్టినా ప్రజల్లోకి వెళ్లలేకపోయారని అనుకుంటున్నారు. విజయవాడ పశ్చిమలో జనసేన ప్రభావం చూపే అవకాశముంది. ఒకప్పుడు ప్రజారాజ్యం గెలిచిన సీటు కావడం, ఓటుబ్యాంకు కూడా ఉండటంతో జనసేన పశ్చిమపై దృష్టిపెట్టింది.