జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు (ఆగస్ట్ 9న) ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరిజిల్లా భీమవరంలో పలు ప్రజాసంఘాలతో సమావేశమయ్యారు. ఉదయం భీమవరం చేరుకున్న ఆయన పట్టణానికి సమీపంలోని పెదఅమిరంలో నిర్మలాదేవీ ఫంక్షన్ హాల్లో బసచేశారు. అక్కడే సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రజాపోరాట యాత్రపై జిల్లా నాయకులతో చర్చించారు. బీసీ, బ్రాహ్మణ, ఆటోడ్రైవర్ల సంఘాలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు విన్న పవన్ ప్రజాపోరాటమే పరిష్కారమని వారికి సూచించారు. పవన్ నాలుగురోజులపాటు భీమవరంలోనే ఉంటారని పార్టీ నేతలు తెలిపారు. రెండురోజుల్లో నరసాపురం, పాలకొల్లు, ఆచంటలో బహిరంగ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
బీసీ సంఘాల నాయకులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ప్రశ్నించడానికే పుట్టిందని జనసేన పార్టీ పరిమితిని తగ్గించొద్దని అన్నారు. తాను చిత్తశుద్ధితో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. జనాభాలో సగం మనమే ఉన్నామని సగం వాటా మనకే కావాలని ఇది ఎందుకు సాధించలేకపోతున్నామనేది ఆలోచించుకోవాలని అన్నారు. ఇది ఎవరో ఇవ్వరని పోరాడి సాధించుకోవాలని అన్నారు. దశాబ్ధాలుగా మనకు అన్యాయం జరిగినప్పుడు దాన్ని గ్రహించకపోవడం, దానిలో సమస్య ఏమిటనేది ముందు మనం గ్రహించాలని అన్నారు. మిగతా వారికంటే కూడా మనం దశాబ్దాలుగా దెబ్బ తింటున్నామనంటే మనలోని అనైక్యతే కారణమని అన్నారు.
కులాల ఐక్యత అనేది జరగొచ్చు.. జరగక పోవచ్చు. కానీ అది సాధించాలనేది తన ఆశయం అన్నారు. కులాల ఐక్యత సమాంతర సమాజంలో ఎఁదుకు అవసరమన్నారు. మనవి వృత్తి ఆధారిత కులాలని, ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నారని అన్నారు. కాపుల రిజర్వేషన్లు గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీలోని కాపు నాయకులు ఏఁ చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే ప్రతి బీసీ కులంలోని నాయకులు వారి కులం గురించి ఏఁ చేస్తున్నారనేది మనం ఆలోచించాలని అన్నారు. ఒక కులానికి న్యాయం జరుగుతున్నప్పుడు ఆ కులంలోనూ సరిచేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయని అన్నారు.
మనం గుడ్డిగా నమ్మి వారి చేతుల్లో మోసపోతున్నామంటే.. మోసపోతున్నామని తెలిసి వారికి ఓట్లు వేస్తున్నామని దాన్ని ఏమంటారో మనల్ని మనం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఇక్కడి కొచ్చిన వారంతా బీసీ నాయకులుగానే మాట్లాడతారు గానీ.. ఎవరికి వారు వారి నియోజకవర్గాలకు వెళ్లిపోయినప్పుడు మళ్లీ ముక్కలుగా విడిపోతారని అన్నారు. అదే సమస్య అయిపోయింది అన్నారు. 2 కులాల మీద కోపం చూపితే సమస్యకు పరిష్కారం జరగదని అన్నారు. మనకు ఉన్నవి రెండే రెండు కులాలు అవి “ఉన్న కులం.. లేని కులం” అన్నారు. దేశంలో ఏమూలన చూసినా కుటుంబాలు బాగుపడుతున్నాయి గానీ కులాలు బాగుపడటం లేదని అన్నారు.
మీరేం చేస్తారు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. నేనిక్కడకు వచ్చింది నన్ను ముఖ్యమంత్రిని చేయాలని అడగటానికి కాదు. నేను పనిచేయడానికి వచ్చాని అని పవన్ కల్యాణ్ అన్నారు. మనం మనషులం మనుషులుగా చూసుకోవడం మానేశాం.. కులాలుగా విడిపోయాం. అలా ఉన్నప్పుడు అధికారం చెలాయించేది కొన్ని కుటుంబాలే ఉంటాయి అన్నారు. రాష్ట్రం మొత్తంలో రెండు కుటుంబాలు అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయని ఆరోపించారు. ఒకటి ముఖ్యమంత్రిగారి కుటుంబం, రెండోది జగన్ కుటుంబం అని అన్నారు. ఒక కులానికి అనుకూలంగా మాట్లాడితే వేరే కులం వారు తనకు దూరమైపోతారని, ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కులం వారు దూరమైపోతారని ఇలా లెక్కలేసి అందరూ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా నిలువునా చీల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.