రజనీకాంత్ కాలా చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నానాపటేకర్ విలన్‌గా నటించడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలే ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలో ఇంకా సాయాజి షిండే, సముద్రకని, సంపత్, అరుల్ దాస్, హ్యుమా కురేషి, అరవింద్, దిలీపన్ తదితరులు నటించారు.
ఈ మధ్యనే సెన్సార్ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. తొలుత జూన్ 7న విడుదల చేయాలనుకున్న ఈ చిత్రం తమిళనాడులోని తూత్తుకుడి కాల్పుల ఘటన కారణంగా వాయిదా పడొచ్చని అనుకుంటున్నారు. అయితే సినీ వర్గాలు ఈ వార్తలను ఖండిస్తున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.
అయితే కావేరీ జలాల విషయంలో కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడిన రజనీకాంత్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వబోమని అక్కడి రాజకీయ పార్టీ నాయకుడు వాటాల్ నాగరాజు ప్రకటించారు. కర్ణాటక సొంత రాష్ట్రమని కూడా చూడకుండా రజనీకాంత్ కావేరీ జలాల నిర్వహణకు బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరడం సమంజసం కాదన్నారు. కర్ణాటకలో కాలా సినిమా విడుదల చేస్తే అడ్డుకుంటామని, తీవ్ర పోరాటం చేస్తామని అన్నారు.