సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కాలా’ టీజర్ విడుదలైంది. టీజర్‌లో రజనీ స్తైల్, డైలాగులు, యాక్షన్ సీన్లు అలరించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీ..కరికాలన్ అనే డాన్ పాత్రలో నటించారు. వండర్ బార్ ఫిలింస్ బ్యానర్‌పై ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పా రంజిత్ దర్శకత్వం వహించారు. టీజర్‌లో.. విలన్ పాత్రలో నటిస్తున్న నానా పాటేకర్..‘కాలా..ఇదేం పేరు’ అంటాడు. అప్పుడు ‘కాలా అంటే నలుపు. కరికాలన్ అంటే గాడ్ ఆఫ్ డెత్. రక్షించడానికి పోరాడేవాడు.’ అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఆకట్టుకుంటోంది.
‘నేనొక్కడినే వచ్చాను. దమ్మున్నోడు రండిరా.. మీరింకా నా పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు. చూస్తారు’ అని రజనీ స్టైల్‌గా చెప్తున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ రజనీకి జోడీగా నటించారు. నానా పటేకర్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఏప్రిల్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.