సూపర్ స్టార్ రజినీ కాంత్ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ చిత్ర మూవీ టిక్కెట్ కోసం రెండు రోజులుగా క్యూలైన్‌లో వేచి ఉన్న రజినీ వీరాభిమాని అలసటతో మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది. తమిళనాడులోని తేని జిల్లా కీల్‌రాజ వీధికి చెందిన కుమరేశన్ (29) నగల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నాడు. అతడు సూపర్ స్టార్ రజినికాంత్‌కు వీరాభిమాని. ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఆ సినిమా చూసేందుకు కుమరేశన్ రెండ్రోజులుగా ప్రయత్నిస్తున్నా టిక్కెట్టు దొరకలేదు.
శుక్రవారం రాత్రి కూడా భారీ క్యూలో వేచి ఉన్నా అతడికి టిక్కెట్టు లభించలేదు. అలసటగా ఉండడంతో ఇంటికి వచ్చిన కుమరేషన్ హఠాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందాడు. రెండ్రోజులుగా నిద్రాహారాలు లేకుండా క్యూలలో వేచి ఉన్న కుమరేశన్ అలసటకు గురై మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.