తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 225 రోజుల పాటు జగన్ పాదయాత్ర పూర్తిచేసుకున్నారు. జులై 31న పిఠాపురంలో జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబూ.. కాపులను మోసం చేసింది.. నువ్వా.. నేనా? ఎవరు మోసం చేశారో ప్రతి కాపు సోదరుడికీ తెలుసని అన్నారు. అధికారంలోకి రాగానే 6 నెలల్లో కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని నాలుగున్నరేళ్లయినా ఏం చేశారు? ప్రశ్నిస్తున్న నేనా మోసం చేసింది.. మాట నిలబెట్టుకోని నీదా అంటూ మండిపడ్డారు. యూ టర్న్ మా ఇంటా వంటా లేదని, మీలా అబద్ధాలు చెప్పలేనని, ఏం చేయాలో అదే చెబుతానని.. ఎల్లో మీడియా నా వ్యాఖ్యలను దారుణంగా వక్రీకరించిందని దుయ్యబట్టారు.
పిఠాపురంలో ప్రజా సంకల్పయాత్రలో భాగంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ, శ్రీ సంస్థానం మాజీ చైర్మన్ రామకృష్ణతో పాటు మరో ఆరుగురు టీడీపీ నాయకులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి వైఎస్ జగన్, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ బాబ్జీ మాట్లాడుతూ..టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలతో మోసపోయామని, మాజీ చైర్మన్ అయిన తనకే రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరికొంతమంది చేనేత సంఘాల ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వైఎస్ జగన్‌కు విన్నవించారు. జీఎస్టీతో తాము ఇబ్బందులు పడుతున్నామని, వైసీపీ అధికారంలోకి వచ్చాక తమకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం జాతీయ రహదారిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. 2014 ఎన్నికలకు ముందు తమకు కూడా ఇళ్ల స్థలాలు, డెత్ బెనిఫిట్స్ మంజూరు వంటి అనేక హామీలు చంద్రబాబు ఇచ్చి అమలు చేయలేదని వైఎస్ జగన్‌కు విన్నవించారు. న్యాయవాదులకు స్టైఫండ్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ జగన్‌కు న్యాయవాదులు వినతిపత్రం సమర్పించారు.