కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన చిత్రం ‘కాంతార’. రిషబ్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఇటీవలే విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలోని ‘వరాహరూపం దైవ వరిష్టం’ అనే పాటపై కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు నిషేధం విధించింది. అనుమతి లేకుండా ఈ పాటను ఎక్కడా ప్రదర్శించరాదని ఆదేశించింది.
భక్తిభావాలతో ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేస్తున్న ‘వరాహరూపం దైవ వరిష్టం’ పాటని కాపీ కొట్టారంటూ ఇటీవల కేరళకు చెందిన మ్యూజిక్‌బ్యాండ్ థాయికుడమ్ బ్రిడ్జ్ ఆరోపించిన విషయం తెలిసిందే. తమ బృందం రూపొందించిన ‘నవరసం’ అనే పాటను కాపీ కొట్టి ‘వరాహరూపం..’ పాటను కంపోజ్ చేశారంటూ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. థాయికుడమ్ బ్రిడ్జ్ అనుమతి లేకుండా ఈ పాటను థియేటర్, ఓటీటీ, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడా ప్రదర్శించరాదని తెలిపింది. ఈ విషయాన్ని థాయికుడమ్ బ్రిడ్జ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ మేరకు పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకు అత్యంత కీలకంగా నిలిచిన ఈ పాటని ‘కాంతార’ టీమ్ తొలిగిస్తే సినిమాకు ఆయువు పట్టుని కోల్పోయినట్టేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.