ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లా మొత్తం కరోనా హాట్ స్పాట్ గా మారిపోయింది. అత్యధిక కేసులతో జిల్లా మొత్తం రెడ్ జోన్ లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు బయటపడినప్పటి నుంచి కర్నూలు జిల్లాలో కరోనా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 411 మంది కరోనా బారిన పడ్డారు. ఇవాళ కొత్తగా 25 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నారు. జిల్లాలో మరో 8 మంది వైద్యులు కరోనాతో బాధపడుతున్నారు. ఇక మున్సిపల్ కమిషనర్ సీసీకి, శానిటరీ మేస్త్రీకి కూడా కరోనా సోకింది.
నెల రోజులుగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఆ అధికారి కరోనా నియంత్రణ విధుల్లో భాగంగా నగరమంతా పర్యటించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోనూ తిరిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీసు సిబ్బంది హడలిపోతున్నారు. ఇక జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి సోదరులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆరుగురు కరోనాతో చికిత్సపొందుతున్నారు. ఆస్పరి మండలం జొహరాపురంలో 11 నెలల చిన్నారికి కరోనా సోకింది. కర్నూలు నగరంలో ఏడేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న 13 మంది బాలురు, నలుగురు బాలికలు కరోనా బారినపడ్డారు. జిల్లా మొత్తంగా 411 కరోనా బాధితులు ఉంటే.. కర్నూలులోనే 231 మంది బాధితులు ఉన్నారు. నంద్యాల అర్బన్ లో 73 మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాలన్నీ కలిపి 324 పాజిటివ్ కేసులు ఉండగా రూరల్ లో 62 పాజిటివ్ కేసులు ఉన్నాయి.