HomeTelugu Big Storiesకరుణానిధి మహాప్రస్థానం

కరుణానిధి మహాప్రస్థానం

తమిళనాడు రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన కరుణానిధి శకం ముగిసింది. తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం(ఆగస్ట్ 7న) సాయంత్రం కన్ను మూశారు. కరుణానిధి మరణంతో తమిళనాడు వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయనను అభిమానులు ‘కళైజ్ఞర్‌’ అని పిలుచుకుంటారు. ఆయన ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయటమేకాదు.. 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

karuna1

కరుణానిధి 1924 జూన్ 3న తమిళనాడులోని తిరుక్కువలై జన్మించారు .తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చెందిన ముత్తువేల్‌ కరుణానిధి అసలు పేరు దక్షిణా మూర్తి. ఈయన తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. వీరి పూర్వికులు ప్రకాశం జిల్లా నుంచి వచ్చినట్లుగా చెబుతుంటారు. ద్రవిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రవిడ నాయకులు మతపరమైన పేర్లను త్యజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు.

karuna2

కరుణకు షణ్ముగ సుందరాంబాళ్‌, పెరియనాయమ్మాళ్‌ అనే చెల్లెళ్లుండేవారు. 8వ తరగతివరకు మాత్రమే చదువుకున్న కరుణకు ఆది నుంచి ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎనలేని మక్కువ. మూఢ విశ్వాసాల నుంచి, తనకు తెలిసిన ప్రపంచం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన చిన్ననాటి నుంచే రకరకాల నాటికలు వేసేవారు. నాటికల రచనతో పాటు తన స్నేహితులతో కలిసి స్వయంగా నాటికల ప్రదర్శన చేసేవారు కూడా. జస్టిస్‌ పార్టీ నాయకుడు అళగిరిస్వామి ప్రసంగాలకే ఉత్తేజితుడై 14 ఏళ్ల ప్రాయంలోనే ఆయన హిందీ వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. హిందీకి వ్యతిరేకంగా నిరసన కార్య క్రమాలు చేపట్టి పలుమార్లు అరెస్టయ్యారు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి.

karuna3

పెరియార్ ద్రవిడ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆయన బాటలో నడిచారు. 1949లో పెరియార్‌తో విభేదించిన ఆయన అనుంగు శిష్యుడు సి.ఎన్.అన్నాదురై.. ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) స్థాపించారు. డీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. ఆ పార్టీ కోశాధికారిగా కరుణానిధిని అన్నాదురై నియమించారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంతం విడిపోయిన అనంతరం తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 1957లో తొలిసారి డీఎంకే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కరుణానిధి కుళితలై నియోజక వర్గం నుంచి పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 33 సంవత్సరాలు. అప్పటి నుంచి ఓటమెరుగని యోధుడిలా తన ప్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చారు.

karuna4

1967లో డీఎంకే తొలిసారి తమిళనాట అధికారం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి అన్నాదురై కేబినెట్లో ప్రజాపన్నుల శాఖ మంత్రిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగాను, ద్రవిడ మున్నేట్ర కజగం అధ్యక్షునిగాను బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 45 ఏళ్లు. 1971 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే సాధించిన విజయాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. ద్రవిడ మున్నేట్ర కగజం(డీఎంకే) అధ్యక్షుడిగా దాదాపు 50 ఏళ్లపాటు కరుణానిధి కొనసాగుతూ వచ్చారు. కరుణానిధితో విభేధాల కారణంగా డీఎంకే నుంచి ఎంజీఆర్‌ విడిపోవటం.. అన్నాడీఎంకే.. వైగో విడిపోయి ఎండీఎంకే.. ఇలా పలు పార్టీలు కరుణానిధి హయాంలోనే పుట్టుకొచ్చి అరవ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాయి.

karuna5

 

కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని అన్నీ (40) లోక్ సభ స్థానాలలో యూపీఏ జెండా ఎగరవేయటంలో ఆయనదే కీలక పాత్ర.

karuna6

తమిళ సాహిత్యంలో కరుణానిధి తనదైన ముద్రను వేసుకున్నారు. తండ్రి వద్ద బాల్యదశలో కొంతకాలం కరుణానిధి నాదస్వరం కూడా నేర్చుకున్నారు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. దక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి. పెరియార్ నిర్వహించిన కుడియరసు పత్రికలో ఉప సంపాదకుడిగా చేరారు. ఎన్నో వ్యాశాలు రాశారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించారు. ద్రావిడ భావజాలం, హేతువాద సిద్ధాంతాల పట్ల కరుణానిధికి ఉన్న నిబద్ధత, ఆయనకున్న వాక్పటిమ, రచనా పాటవం కారణంగా అనతికాలంలోనే డీఎంకేలోని అగ్రశ్రేణి నాయకులలో ఒకరుగా ఆయన ఎదిగారు.

karuna7

కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. ఆయన ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయటమేకాదు.. 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 95 సంవత్సరాల జీవితంలో 80 సంవత్సరాలు ప్రజలకోసమే అంకింతం చేసిన మహావ్యక్తి కరుణానిధి. కరుణానిధి గత కొన్ని రోజులుగా వయోభారం కారణంగా వచ్చిన రుగ్మతలతో బాధపడుతూ చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు అనగా 2018 ఆగస్టు 7 సాయంత్రం 6.10 గంటల సమయంలో కరుణానిధి తుదిశ్వాస విడిచినట్టు హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. ద్రావిడుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహాయోధునిగా ప్రజల మెప్పును పొందారు కరుణానిధి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu