దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా కేరాఫ్ ‘కంచరపాలెం’. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగస్థి సంగీతం అందిస్తున్నారు. న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం. వైజాగ్ దగ్గరలో ఉన్న కంచెరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథ ఇది. సెప్టెంబరు 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ‘కంచరపాలెం’ సినిమాను సమర్పిస్తుండటం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని నమ్ముతున్నా. ఈ ఏడాది రాబోతున్న అతి పెద్ద చిన్న సినిమా ఇది’అంటూ రానా ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.
రైలు కూతతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘అమ్మల్లారా.. అక్కల్లారా.. చెల్లెల్లారా.. మన ఊరి రాజు గాడికి 49 సంవత్సరాలు వచ్చినా పెళ్లి అవలేదు గనుకు ఆడోళ్లంతా నానా రకాలుగా మాట్లాడుతున్నారు.. మగోళ్లంతా భయపడుతున్నారు’ అంటూ ఓ తాత చాటింపేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘చిన్నా లేదు పెద్దా లేదు ప్రతి ఒక్కడూ నా పెళ్లి గురించి మాట్లాడుకునేవాడే’ అంటూ ఓ నటుడు తిట్టుకుంటున్నారు. రే గెడ్డం.. నీ ఫిగర్ వచ్చింది రా. అని స్నేహితుడు అంటే.. తొలిసారి మా మందు షాపుకు వచ్చావే.. అప్పుడే నిన్ను చూసి పడిపోయా అని ఓ కుర్రాడు అమ్మాయితో చెబుతున్నారు. ఆవిడంటే ఇష్టం అంటున్నావ్. మరి పెళ్లి చేసుకోవడానికి ఏంటిరా నొప్పి నీకు అని (49 ఏళ్ల వ్యక్తి పాత్ర) నటుడ్ని పెద్దలు ప్రశ్నిస్తే.. నా పెళ్లి గురించి మీ పంచాయతీ ఏంటండి? అని తిరిగి కోపంగా అన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 7 న విడుదల కాబోతున్నది