శరత్‌చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన చిత్రం ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ఆధారంగా రూపొందింది ఈ చిత్రం. ఈ సందర్భంగా శరత్‌చంద్ర పాత్రికేయులతో ముచ్చటిస్తూ “చిన్నప్పటినుంచి హీరో కావాలనుకునేవాణ్ణి. కొన్ని సినిమా షూటింగులు చూసిన తర్వాత సినిమాలంటే ఆసక్తి తగ్గింది. అమ్మా,నాన్నల ఒత్తిడితో అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాను. కోర్సు పూర్తయ్యాక ఏం చేస్తావని మా గురువుగారు అడిగితే ఇంటికెళ్తాను అని చెప్పాను. ఆయన నా ధృక్పథాన్ని మార్చారు. ఆ తర్వాత ‘ఐపీసీ సెక్షన్ భార్య బంధు’ చేసే అవకాశం వచ్చింది. ఇందులో న్యాయవాదిగా కనిపిస్తా.
మన దేశంలో మహిళలు, వృద్ధులు, చిన్నారులకు అండగా కొన్ని చట్టాలు, సెక్షన్లు ఉన్నాయి. కానీ భార్యల వల్ల కష్టాలు పడే భర్తల కోసం ఒక్క చట్టం కూడా లేదు. ‘ఇండియన్ పీనల్ కోడ్‌లో ‘ఓ కీలకమైన సెక్షన్’ ఇల్లాలి పీనల్ కోడ్’గా మారడంతో ఎంతోమంది మగాళ్లు కష్టాలు పడుతున్నారు. పెళ్లయిన మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ విషయాన్నే మా సినిమాలో చూపించాం” అన్నారు. పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉండాలనేది తెలియజెప్పాం.సినిమాలో సందేశం, మంచి కామెడీ, మంచి పాటలు ఉన్నాయి అని అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న నేహాదేశ్ పాండే మాట్లాడుతూ, నా పాత్రలో రెండు కోణాలుంటాయి.”సంప్రదాయమైన అమ్మాయిగా, వెస్ట్రన్ డ్యాన్సర్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేశాను.” అన్నారు నేహా దేశ్‌పాండే.