ఏపీలో గులాబీ గుభాళించనుందా..? టీఆర్‌ఎస్ అభిమాన గణం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుందా..? అనుకున్నట్లుగానే కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నాడా..? అవసరమైతే ఏపీలోనూ పోటీ చేస్తానని చెప్పిన కేటీఆర్ మాటలు నిజమవుతున్నాయా..? వీటిన్నికి సమాధానం ఇప్పుడు దొరకబోతుంది. అవును.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా స్థాపించబడిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయనుంది.! కేసీఆర్‌కు వీరాభిమాని అయినా ఓ వ్యక్తి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి భీ ఫాం తీసుకొని ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనమైంది.
ప్రత్యేక తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడలో పర్యటించారు. ఇక్కడి ప్రముఖ దేవాలయం కనకదుర్గ గుడిలో మొక్కులు తీర్చుకున్నారు. 101 కొబ్బరికాయలు కొట్టారు. అలాగే మొకాళ్లపై నడిచి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. దీంతో కేసీఆర్ స్థానికంగా అభిమానులను సంపాదించుకున్నారు. వీరిలో వీరాభిమాని అయిన కొణిజేటి ఆదినారాయణ టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దీంతో కేసీఆర్ తెలంగాణతో పాటు ఆంధ్రలోనూ పాగా వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే మూడో ఫ్రంట్ మాత్రమే దేశంలో అధికారం ఉంటుందన్ని ప్రకటిస్తున్న కేసీఆర్ అందులో భాగంగా ఆంధ్రలో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని సెటిలర్లతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. దీంతో అప్పటి వరకు టీడీపీ వైపు ఉన్నవారంతా టీఆర్‌ఎస్‌వైపు అభిమానులుగా మారినట్లు టాక్. దీంతో కూకట్‌పల్లి లాంటి నియోజకవర్గాల్లో సైతం టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది.
ఇదే ఊపుతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోటీ చేస్తే టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరిస్తారని అభిప్రాయపడుతున్నారు. అయితే తమకు అభ్యర్థి దొరికితే బీ ఫాం ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ మదిలో ఉండగానే బెజవాడ ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ పోటీ చేస్తాననడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశాడని సమావేశాల్లో చెబుతున్నారు. దీంతో కొన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి బాబు నేర్చుకోవాలి అని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కూడా ఉన్నాయి.
ఈ తరుణంలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత తీసుకురావడానికి టీఆర్‌ఎస్ పోటీ చేయడం అవసరమని ఆ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన బెజవాడ సీటును కొణిజేటి ఆదినారాయణ ఎంచుకున్నట్లు రాజకీయంగా చర్చ సాగుతోంది. ఒకవేళ ఇక్కడ టీఆర్‌ఎస్ విజయం సాధిస్తే ఆ తరువాత ఎన్నికల్లో ఆంధ్రలోని కొన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కానీ అది జరిగేపని కాదని ఏపీ రాజకీయ పండితులు ఘంటాపథంగా చెబుతున్నారు. కేసీఆర్ అంటేనే పడని ఆంధ్రా జనాలు ఆ పార్టీని ఓడిస్తారని అంటున్నారు.