ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల అవసరం పడింది. అది కూడా ఎంపీ సీట్లకు తెలుగుదేశం పార్టీ కి అభ్యర్థుల అవసరం తీవ్ర స్థాయికి చేరింది. గత ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచిన సీట్లకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల వెతుకులాటలో ఉండటం గమనార్హం.
గత ఎన్నికల్లో టీడీపీ పదిహేను ఎంపీ సీట్లలో నెగ్గింది. రెండు ఎంపీ సీట్లలో బీజేపీ నెగ్గింది. ఎనిమిది సీట్లలో వైసీపీ నెగ్గింది. ఇప్పుడు వైసీపీ నెగ్గిన ఎనిమిది సీట్లకు, బీజేపీ తో పొత్తు లేకపోవడంతో ఆ రెండు సీట్లకూ టీడీపీ అభ్యర్థులను రెడీ చేసుకోవాలి. వాటిల్లో పార్టీ బలహీనంగా ఉంది. ఫలితంగా అభ్యర్థులే దొరకని పరిస్థితి.
అంతకన్నా విశేషం.. గెలిచిన సీట్లలోని నేతలు ఇప్పుడు పోటీకి అందుబాటులో లేకుండా పోవడం. ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారిలో.. ఒక్కొక్కరుగా చేతులు ఎత్తే స్తూ ఉన్నారు. మురళీ మోహన్, కొనకళ్ల నారాయణలు పోటీకి నో చెప్పారు. ఇక జేసీ కూడా పోటీకి విషయంలో వెనుకడుగు వేశాడు. కొడుకును కూడా పోటీ చేయించడానికి ఆయన రెడీగా లేరనే ప్రచారం సాగుతూ ఉంది. నిమ్మల కిష్టప్ప కూడా పోటీకి ఆసక్తితో లేడట.
ఇలా తెలుగుదేశం పార్టీ తరఫున గత ఎన్నికల్లో నెగ్గిన వారిలో సగం మంది చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థూలంగా కనీసం పదిహేను లోక్ సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో తర్జనభర్జన పడుతూ ఉంది. ఎంపీలుగా పోటీ చేసేందుకు అభ్యర్థుల కోసం అన్వేషిస్తూ ఉంది. తీరా ఎన్నికల షెడ్యూల్ వస్తున్న తరుణంలో టీడీపీలో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుండటం విశేషం.