ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పార్టీ నాయకులు కొందరితో సమావేశమయ్యారు. నాయకులను, శ్రేణులను ఇప్పటినుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ, ప్రభుత్వ పనితీరును సమీక్షించుకుని కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 5న టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సమావేశం జరగనుంది. ఇంకా నిర్వహించాల్సిన ధర్మపోరాట సభలు, క్రైస్తవ, మైనారిటీ, గిరిజన, బీసీ సభల నిర్వహణ తదితర అంశాలపై కార్యాచరణ సిద్ధం చేస్తారు. ధర్మపోరాట సభను ఈ నెలలో పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహిస్తారు. అక్టోబరులో రాజమహేంద్రవరంలో బీసీ తేజం సభ నిర్వహిస్తారు. గిరిజన గర్జన సభను విజయనగరం జిల్లాలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 6 నుంచి శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో జిల్లాలవారీగా పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.
“బీసీలే టీడీపీకి వెన్నెముక. త్వరలో ఉత్తరాంధ్రలో బీసీల సదస్సు నిర్వహించాలి. దీనికిముందు అన్ని బీసీ కులాలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి ఏం చేశాం? ఏం చేయాలన్న అంశాలపై చర్చించాలని పేర్కొన్నారు. గుంటూరులో తెదేపా నిర్వహించిన మైనారిటీ సదస్సుకు నంద్యాల నుంచి వైసీపీ కార్యకర్తలను పంపడమేంటి? వైసీపీ కార్యక్రమాలకు వెళ్లి టీడీపీ కార్యకర్తలు ఎప్పుడైనా అల్లర్లు సృష్టించారా? వైసీపీ ఆవిర్భావం తర్వాతే ఇలాంటి పెడధోరణులు. టీడీపీ కార్యక్రమాల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ధర్మపోరాటం సభలు మరో ఏడు నిర్వహించాల్సి ఉంది. జనవరికల్లా పూర్తి చేయాలి. ఈ నెలలో ముఖ్యమంత్రి ప్రాజెక్టుల సందర్శన- జలసిరికి హారతి కార్యక్రమాలు చేపడతాం. త్వరలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర జలాశయాలను సందర్శిస్తా. సాగర్ కుడికాలువ ఆయకట్టుకు నీరు రావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. రైతులతో మమేకమై వారికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రభావవంతంగా వివరించాలి. మేనిఫెస్టోలోని అన్ని హామీలను కేవలం 50 నెలల్లోనే నెరవేర్చడం ఒక రికార్డు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని త్వరలోనే అమల్లోకి తెస్తున్నాం. వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని తెలిపారు. ఈ నెల 6 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్ని టీడీపీ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలపట్ల ఉన్న బాధ్యత నిర్వర్తించడంలో వైసీపీ విఫలమైంది. వైసీపీ సభ్యులు పార్లమెంటుకు వెళ్లరు, అసెంబ్లీకి రారు అని వ్యాఖ్యానించారు.
పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామవికాసం కార్యక్రమం ఇప్పటికీ 18.4 శాతమే పూర్తవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. లక్ష్యం కన్నా20 శాతం వెనకబడినట్టు తెలిపారు. డిసెంబరుకల్లా అన్ని గ్రామాలు, వార్డుల్లో కార్యక్రమం పూర్తి కావాలని స్పష్టంచేశారు. గ్రామ వికాసంలో స్థానిక సంస్థల ప్రతినిధుల ప్రాతినిధ్యం బాగుందని, ఎంపీలు, జిల్లా పార్టీల అధ్యక్షుల భాగస్వామ్యం తక్కువగా ఉందని తెలిపారు. బూత్ కన్వీనర్ల శిక్షణ ఇంకా 54 శాతం పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఓటర్ల నమోదుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధ పెంచాలని అన్నారు.