హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త ముత్తా గోపాలకృష్ణ . ఈ సందర్భంగా పవన్ కోరిక మేరకు త్వరలోనే జనసేనలో చేరేందుకు అంగీకరించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ముత్తాకు ప్రత్యేక స్థానం కల్పించనున్నట్లు పవన్ తెలిపారు. మరోవైపు ఈ నెల 14న జనసేన పార్టీ ఎన్నికల ముందస్తు ప్రణాళికను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది.
విద్యావ్యవస్థపై పార్టీ పాలసీ కమిటీ రూపొందించిన ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించిన రాజకీయ వ్యవహారాల కమిటీ… ఫిన్లాండ్ తరహాలో విద్యావిధానాలను ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా అమలు చేసే తీరుపై అధ్యయనం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు జనసేన సంస్థాగత నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, అమరావతి ప్రాంతాలకు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు.