ఏడు దశాబ్దాల బాలీవుడ్ కు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆర్ కె స్టూడియో అమ్మకానికి రెడీ అయింది. ప్రఖ్యాత నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ నిర్మించిన ఈ స్టూడియోను అమ్మేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నగరంలో అతిపెద్ద స్టూడియోల్లో ఒకటైన ఆర్కే స్టూడియోస్‌ను అలనాటి బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్‌కపూర్ నిర్మించారు.
కొన్ని నెలల క్రితం ఆర్కే స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో రాజ్‌కుపూర్‌కు సంబంధించిన అన్ని వస్తువులు కాలిపోయాయి. దాంతో ఇక స్టూడియోస్‌ను నడపడంలో అర్థంలేదని భావించినట్లు రిషి తెలిపారు.
‘మా గుండెలు రాయి చేసుకుని తీసుకున్న నిర్ణయమిది. ఆధునిక పరికరాలను వాడి స్టూడియోస్‌ను పునర్నిర్మించాలని అనుకున్నాం. కానీ సగానికిపైగా భవనం అగ్నిప్రమాదంలో బూడిదైపోయింది. దానిని బాగుచేసే పరిస్థితి లేదు. అగ్ని ప్రమాదానికి ముందు కూడా స్టూడియో నష్టాల్లో ఉంది. అందుకే ఈ నిర్ణయానికొచ్చాం. మా అన్నదమ్ములం ఇన్నాళ్లూ ఒకరికోసం ఒకరం అన్నట్లుగా బతికాం. కానీ రేపు రాబోయే తరాలు ఎలా ఉంటారో చెప్పలేం. ఏవైనా గొడవలు వచ్చి ఆస్తులు పంచుకునే పరిస్థితి రావచ్చు. అవి కోర్టు వరకూ వెళ్లొచ్చు. ఆ కేసు తేలకపోగా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మా నాన్న కష్టపడి స్థాపించిన ఈ స్టూడియో న్యాయస్థానం ఆధ్వర్యంలో ఉండటం నాకు ఇష్టం లేదు’. అని వెల్లడించారు రిషి.